దేవుడా.. నేనేం తప్పు చేశాను?

0Ram-Rahim-to-DGP-Prisonఅత్యాచార కేసులో శిక్ష అనుభవిస్తున్న డేరా బాబా గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌ తనకు 20ఏళ్ల జైలుశిక్ష పడిందన్న నిజాన్ని ఇంకా నమ్మలేకపోతున్నాడు. రోహ్‌తక్‌ జైలులో శిక్ష ఖరారు చేసిన నాటి నుంచి రోజూ ఏడుస్తూనే ఉన్నాడట. తాను ఏం తప్పు చేశానని గట్టిగట్టిగా అరుస్తున్నాడట. రోహ్‌తక్‌ జైల్లో శిక్ష అనుభవించి ఇటీవలే బయటకు వచ్చిన ఓ వ్యక్తి ఈ వివరాలను మీడియాకు తెలిపాడు.

ఓ కేసులో భాగంగా రోహ్‌తక్‌ జైలులో ఖైదీగా ఉన్న స్థానిక దళిత నేత స్వదేశ్‌ కరార్‌ ఇటీవలే బెయిల్‌పై విడుదలయ్యాడు. జైల్లో గుర్మీత్‌కు సమీపంలోని సెల్‌లో స్వదేశ్‌ ఉన్నాడు. గుర్మీత్‌ ప్రవర్తనపై స్వదేశ్‌ నేడు మీడియాతో మాట్లాడాడు. ‘గుర్మీత్‌కు జైల్లో ఎలాంటి వీఐపీ సదుపాయాలు లేవు. అతడిని సాధారణ ఖైదీలాగే చూస్తున్నారు. ఇద్దరు జైలు సిబ్బంది అతడిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. గుర్మీత్‌ తాగేందుకు మినరల్‌ వాటర్‌ అడిగాడు. అయితే గుర్మీత్‌ సొంత డబ్బు నుంచి ఆ నీటిని అతడికి అందిస్తున్నారు. జైలు శిక్ష పడిన నాటి నుంచి గుర్మీత్‌ ఏడుస్తూనే ఉన్నాడు. సరిగా తినడం లేదు. నిద్రపోవడం లేదు. తొలి రోజైతే కనీసం మంచినీళ్లు కూడా తాగలేదు. రోజంతా తనలో తానే మాట్లాడుకుంటూ ఉన్నాడు. రాత్రయితే దేవుడా నేనేం తప్పు చేశాను అంటూ పంజాబీలో గట్టిగట్టిగా అరుస్తున్నాడు’ అని స్వదేశ్‌ తెలిపాడు.

ఇద్దరు సాధ్వీలపై అత్యాచారం చేసిన కేసులో పంచకులలోని సీబీఐ ప్రత్యేక కోర్టు.. గుర్మీత్‌ను దోషిగా తేల్చిన విషయం తెలిసిందే. ఈ కేసులో అతడికి 20ఏళ్ల జైలు శిక్ష పడింది. గుర్మీత్‌ను దోషిగా తేల్చడంతో అతడి అనుచరులు పంచకుల సహా పంజాబ్‌, హరియాణాల్లోని పలు ప్రాంతాల్లో పెను విధ్వంసం సృష్టించారు. వాహనాలను, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు. ఈ అల్లర్లలో 38 మంది ప్రాణాలు కోల్పోయారు.