చరణ్-హీరోయిన్.. కష్టం చూశారా?

0తన భర్త రామ్ చరణ్ కు సంబంధించి ఆసక్తికర విశేషాల్ని ట్విట్టర్ ద్వారా పంచుకుంటూ ఉంటుంది ఉపాసన కామినేని. అవి చాలా వరకు ఎక్స్ క్లూజివ్ గా ఉంటూ ఉంటాయి. తాజాగా చరణ్ వీడియో ఒకటి ఆమే షేర్ చేసింది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కోసం ప్రస్తుతం చరణ్ అండ్ కో బ్యాంకాక్ లో ఉన్న సంగతి తెలిసిందే. అక్కడ కూడా చరణ్ సినిమా కోసం ఎలాంటి కసరత్తులు చేస్తున్నాడో ఈ వీడియోలో చూడొచ్చు. తన ప్రతి సినిమాకూ బాడీని మంచి షేప్ లో ఉంచుకోవడానికి చూస్తాడు చరణ్. బోయపాటి సినిమా కోసం కూడా స్పెషల్ లుక్ లో కనిపించనున్నాడు. ఇందుకోసం విరామ సమయాల్లో బాగానే కష్టపడుతున్నాడు. విశేషం ఏంటంటే అతడితో పాటు హీరోయిన్ కియారా అద్వానీ కూడా అదే స్థాయిలో శ్రమిస్తోంది.

ఒక ట్రైనర్ ఆధ్వర్యంలో వీళ్లిద్దరూ కలిసి కసరత్తులు చేస్తుండటం విశేషం. చరణ్ కు ఏమాత్రం తగ్గకుండా కియారా కష్టపడుతుండటం ఆసక్తి రేకెత్తించే విషయం. ఇలా తన భర్త.. మరో కథానాయికతో కలిసి కసరత్తులు చేస్తుంటే దాన్ని ఉపాసన సోషల్ మీడియాలో పంచుకోవడం విశేషమే. త్వరలోనే బ్యాంకాక్ షెడ్యూల్ ముగించుకుని హైదరాబాద్ రాబోతోంది ఈ చిత్ర బృందం. ‘భరత్ అనే నేను’తో మంచి విజయాన్ని ఖాతాలో వేసుకున్న డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్నందిస్తాడు. బోయపాటి స్టయిల్లో మాస్ గా ఉంటూనే అతడి గత సినిమాలకు కొంచెం భిన్నంగా ఉంటుందట ఈ చిత్రం. కుదిరితే దసరాకు లేదంటే సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఇప్పటికే రెండు షెడ్యూళ్లు పూర్తి చేసుకుని మూడో షెడ్యూల్లో ఉందీ సినిమా.