భారం మొత్తం అత్తయ్య మీదే!

0తెలుగు తెరకు అత్తా అల్లుళ్ళ జగడం ఈనాటిది కాదు. ఒకప్పుడు ఇవి రాజ్యమేలాయి. ఈగోతో రగిలిపోయే అత్త తెలివిగా తనను పడగొట్టే అల్లుడు ఫార్ములాతో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. ఘన విజయాలు సొంతం చేసుకున్నాయి ప్లస్ ఘోరంగా దెబ్బా తిన్నాయి. కాకపోతే ఇక్కడ గమనించాల్సిన అంశం మరొకటి ఉంది. వీటిలో అత్తయ్యల డామినేషన్ హీరోలకు సమానంగా ఉంటుంది. ఒకరకంగా చెప్పాలంటే మాస్ ని ఆకట్టుకుంది ఈ అంశమే. గుండమ్మ కథలో సూర్యకాంతం పాత్ర అంత దూకుడుగా లేకపోతే అల్లుళ్ళుగా నటించిన ఎన్టీఆర్ ఎఎన్ ఆర్ లకు పెద్ద పనుండేది కాదు. అత్తకు యముడు అమ్మాయికి మొగుడులో చిరంజీవికి ధీటుగా సవాల్ విసరబట్టే ఓ ఐదేళ్ల పాటు అత్త సినిమాలు అన్నింటిలో వాణిశ్రీనే కనిపించారు. టైటిల్ చెబితే చాలు హీరోతోపాటు ఆవిడ కూడా వెంటనే గుర్తొచ్చేవారు. బాలకృష్ణ నారి నారి నడుమ మురారిలో శారద గారిని కాకుండా వేరొకరిని ఊహించుకోలేం. బాలయ్యతో సై అంటే సై అంటూ ఆవిడ పోటా పోటీ నటన సక్సెస్ లో ప్రధాన పాత్ర పోషించింది. కానీ రాను రాను ఇది రొటీన్ కావడంతో ఈ సిరీస్ లో సినిమాలు రావడం ఆగిపోయాయి. సుమన్ లాస్ట్ బ్యాచ్ హీరో అని చెప్పొచ్చు.

ఇప్పుడు ఇంత గ్యాప్ తర్వాత నాగ చైతన్య వంతు వచ్చింది. 13న విడుదల కానున్న శైలజారెడ్డి అల్లుడు మీద భారీ హైప్ లేకపోయినా ఏడాది తర్వాత వస్తున్న చైతు సినిమా అందులోనూ మొదటి సారి మాస్ గా ట్రై చేసాడు కాబట్టి అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇప్పుడు కూడా అత్త పాత్ర చేస్తున్న రమ్య కృష్ణ మీదే పెద్ద భారం కనిపిస్తోంది. ఎందుకంటే కథలో కీలకంగా కనిపిస్తోంది తనే కాబట్టి. గోపి సుందర్ మ్యూజిక్ యావరేజ్ రిపోర్ట్ తెచ్చుకుంది. అను ఇమ్మానియేల్ మీద ఐరన్ లెగ్ ముద్ర ఇంకా తొలగిపోలేదు. దీంతోనే బ్రేక్ వస్తుందని ఆశగా ఉంది. ఊర మాస్ హీరోయిజం చైతు ఎంత వరకు పండిస్తాడో చెప్పలేం కానీ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో యమా పవర్ ఫుల్ గా కనిపిస్తున్న రమ్య కృష్ణ పాత్రను దర్శకుడు మారుతి ఎలా తీర్చిదిద్దాడు అనే దాని మీదే సక్సెస్ ఆధారపడి ఉంటుంది. సెప్టెంబర్ 13న తన భార్య సమంతా యుటర్న్ తో పోటీ పడుతున్న చైతుకు ఇది సక్సెస్ కావడం చాలా అవసరం. ఏడాది తర్వాత వస్తున్న సినిమా కాబట్టి ఫ్యాన్స్ కూడా బోలెడు ఆశలు పెట్టుకున్నారు. ఏ మాత్రం తేడా వచ్చిన మరీ బలంగా లేని చైతు మార్కెట్ మీద ప్రభావం పడుతుంది. సో లెట్ వెయిట్ అండ్ సి.