మంచి కమర్షియల్ హిట్ చేజార్చుకున్న రానా!!

0దగ్గుబాటి ఫ్యామిలీ నుండి ఎంట్రీ ఇచ్చిన రానాకు ఇప్పటి వరకు హీరోగా మంచి కమర్షియల్ సక్సెస్ దక్కలేదు. ‘బాహుబలి’ చిత్రంలో రానా నటించినప్పటికి ఆ చిత్రం సక్సెస్ క్రెడిట్ రానాకు దక్కలేదు. హీరోగా సక్సెస్ కోసం ప్రయత్నాలు చేస్తోన్న రానాకు ఈమద్య ‘నేనే రాజు నేనే మంత్రి’ చిత్రంతో ఒక మోస్తరు సక్సెస్ దక్కింది. రానా తాజాగా ‘కేరాఫ్ కంచరపాలెం’ అనే చిత్రాన్ని నిర్మించాడు. మొదటి సారి సినిమా నిర్మాణ బాధ్యతలు నెత్తికి ఎత్తుకున్న రానా ఆ చిత్రం ప్రమోషన్ విషయంలో చాలా ఇన్వాల్వ్ అవుతున్నాడు. తాజాగా చిత్ర ప్రమోషన్ ప్రెస్మీట్లో మాట్లాడుతూ ‘పటాస్’ చిత్రం మిస్ చేసుకున్న విషయాన్ని చెప్పుకొచ్చాడు.

నందమూరి హీరో కళ్యాణ్ రామ్ హీరోగా ఎంట్రీ ఇచ్చి పుష్కర కాలం దాటింది. అతనొక్కడే చిత్రం తర్వాత కళ్యాణ్ రామ్ సక్సెస్ కోసం సుదీర్ఘ కాలం ఎదురు చూడాల్సి వచ్చింది. చాలా కాలంకు పటాస్ తో కళ్యాణ్ రామ్ కు సక్సెస్ దక్కింది. కళ్యాణ్ రామ్ చేసిన ‘పటాస్’ స్క్రిప్ట్ మొదట రానా వద్దకు వెళ్లిందట. ఈ విషయాన్ని స్వయంగా రానా తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ‘బాహుబలి’ చేస్తున్న సమయంలో దర్శకుడు అనీల్ రావిపూడి తన వద్దకు ఆ కథను తీసుకు రావడం జరిగిందట. సురేష్ ప్రొడక్షన్స్ లో ఆ సినిమాను నిర్మించేందుకు ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా జరిగిందట.

స్క్రిప్ట్ చర్చల్లో రానా కూడా పాల్గొన్నాడని – కాని ‘బాహుబలి’ ఆలస్యం అవ్వడంతో ‘పటాస్’ ప్రాజెక్ట్ ను దర్శకుడు కళ్యాణ్ రామ్ వద్దకు తీసుకు వెళ్లాడని రానా పేర్కొన్నాడు. ఒక వేళ రానా ఆ ప్రాజెక్ట్ చేసి ఉంటే మంచి కమర్షియల్ సక్సెస్ ఆయన ఖాతాలో పడేది. ఇలాంటి సంఘటనలు ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా జరుగుతూనే ఉంటాయి. ఒకరి నుండి మిస్ అయిన ప్రాజెక్ట్ మరొకరికి భారీ విజయాలను తెచ్చి పెట్టడం మనం గతంలో కూడా చూశాం. అయితే రానా ఈ ప్రాజెక్ట్ ను మిస్ అవ్వడం ఆయన కెరీర్ కు చాలా పెద్ద నష్టంగా చెప్పుకోవచ్చు.