చెప్పాలి రానా తప్పదు!

0టాలీవుడ్ కు హీరోగా పరిచయమైనా వాటికి దూరంగా విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అన్ని రకాల పాత్రలు చేస్తూ తనలో నటుడిని సానబెడుతున్న రానా గత ఏడాది సాధించిన మూడు విజయాలతో మరింత జోష్ తో దూసుకుపోతున్నాడు. ఈ ఏడాది ఏవేవో కారణాల వల్ల సోలోగా చెప్పుకోదగ్గ సినిమా ఒక్కటి విడుదల చేయలేకపోయిన రానా వచ్చే ఏడాది మాత్రం వరసబెట్టి పలకరించబోతున్నాడు. మరీ ముఖ్యంగా ఎన్టీఆర్ బయోపిక్ లో నారా చంద్రబాబునాయుడుగా లుక్ బయటికి వచ్చినప్పటి నుంచి స్పందన మాములుగా లేదు. సరే చాలా రోజులు గ్యాప్ వచ్చింది కదా అని రానా తన అభిమానులతో సోషల్ మీడియా ద్వారా లైవ్ చాట్ చేద్దామని ముచ్చట పడి ఆ మేరకు ముందే సమాచారమిచ్చాడు ప్రశ్నలతో సిద్ధంగా ఉండమని. ఇది ఈ మధ్య అందరు సెలెబ్రిటీలు చేస్తున్నదే. కొత్తదేమీ కాదు. అందుకే రానా కూడా అదే చేయబోయాడు. సినిమాలకు సంబంధించిన ప్రశ్నలు మాత్రమే అడగమని ముందే చెప్పాడు లెండి.

అయినా కండీషన్స్ ప్రకారం ప్రశ్నలు అడగడానికి సోషల్ మీడియా మన కంట్రోల్ లో ఉండదుగా. రానా లైవ్ లో రావడం ఆలస్యం కుశల ప్రశ్నలు అయ్యాక పెళ్లి గురించి అడగడం మొదలు పెట్టారు. మరికొందరు ఆరోగ్యం గురించిన క్వశ్చన్స్ సంధించారు. అదంతా ఓకే. ఏదో రకంగా సర్దుకోవచ్చు. ఎన్టీఆర్ బయోపిక్ లో చంద్రబాబు నాయుడు పాత్ర గురించి ఎంక్వయిరీలు మొదలుపెట్టడంతో వచ్చింది అసలు సమస్య. ఆ పాత్ర నెగటివ్ గా చూపిస్తారా నిజాలే చూపిస్తారా మీరు చంద్రబాబుని సమర్థిస్తున్నారా వెన్నుపోటు సీన్ ఉంటుందా అంటూ వరసబెట్టి దాని గురించే అడగటం మొదలుపెట్టారు. దీంతో రానా చాటింగ్ మధ్యలోనే ఆపేసి వెళ్ళిపోయాడు. కాసేపు ఫ్యాన్స్ ఎదురు చూసారు కానీ లాభం లేకపోయింది. అయినా రానా సోషల్ మీడియాను తక్కువ అంచనా వేసాడు కాబోలు. ఫ్యాన్స్ ఒకటే కాదు అన్నిరకాల జనాలు వస్తారు అని మర్చిపోతే ఎలా.