బాలీవుడ్ లో మరోసారి రానా

0ప్రస్తుతం దక్షిణాది నటుల్లో పలు భాషల్లో డిమాండ్ ఉన్న నటుడు రానా దగ్గుబాటి. ‘బాహుబలి’.. ‘ఘాజీ’ లాంటి సినిమాలతో అతడికి దేశమంతా మంచి గుర్తింపు వచ్చింది. అతడిని హీరోగా పెట్టుకుంటే ఆ సినిమాకు చాలాచోట్ల మార్కెట్ ఉంటుంది. అందుకే వేరే భాషల నుంచి అతడికి మంచి ఆఫర్లు వస్తున్నాయి. అతడితో మల్టీ లాంగ్వేజ్ సినిమాలు తీయడానికి దర్శక నిర్మాతలు ముందుకొస్తున్నారు. ‘బాహుబలి’ కంటే ముందే రానా బాలీవుడ్లో రెండు మూడు సినిమాలు చేశాడు. అవి అతడికి మంచి పేరు తెచ్చాయి. ‘బాహుబలి’ తర్వాత కూడా మంచి ఆఫర్లు వచ్చాయి కానీ అతను హడావుడి పడలేదు. ఐతే తాజాగా రానా ఒక హిందీ సినిమాను ఓకే చేసినట్లు సమాచారం.

‘బాహుబలి’ హిందీ వెర్షన్ కు నిర్మాతగా వ్యవహరించి.. దాన్ని సొంతంగా రిలీజ్ చేసిన కరణ్ జోహార్ ప్రొడక్షన్లో రానా నటించబోతున్నాడు. ఆ చిత్రం పేరు.. రణ్ భూమి. ప్రస్తుతం కరణ్ నిర్మాణంలో ‘ధడక్’ సినిమా చేస్తున్న శశాంక్ ఖైతాన్ దర్శకత్వం వహించబోయే సినిమా ఇది. ఇందులో వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్నాడు. ఇందులో ఓ కీలక పాత్రకు రానాను ఎంచుకున్నట్లు సమాచారం. ‘ధడక్’ పని పూర్తి కాగానే శశాంక్ ఈ సినిమాను మొదలుపెడతాడు. ఇందులో ఇంకా భారీ తారాగణమే ఉంది. హై బడ్జెట్లో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఇది కాకుండా రానా దక్షిణాదిన మూణ్నాలుగు సినిమాలు కమిటై ఉన్నాడు. ప్రస్తుతం ప్రభు సాల్మన్ దర్శకత్వంలో ‘అరణ్య’ సినిమాలో నటిస్తున్నాడు రానా. ఈ చిత్రం మూడు భాషల్లో విడుదల కానుంది.