ఆ ముగ్గురిని కాదని రానాతోనే!

0

భళ్లాల దేవ రానా లైనప్ చూస్తుంటే షాక్ తినకుండా ఉండలేం. ఇప్పటికిప్పుడు వరుసగా భారీ బహుభాషా చిత్రాల్లో నటిస్తూ ఆశ్చర్యపరుస్తున్నాడు. హాథీ మేరా సాథీ చిత్రాన్ని తెలుగు – తమిళం – హిందీలో రిలీజ్ చేసేందుకు దాదాపు 100 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారని ప్రచారమైంది. ఆ సినిమాతో పాటు ప్రస్తుతం అక్షయ్ కుమార్ – ఫర్హాద్ సామ్ జీల `హౌస్ ఫుల్ 4`లోనూ నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా కోసం ముంబై లొకేషన్లలో బిజీ అయిపోయాడు రానా.

ఇలా భారీ చిత్రాలతో బిజీలో ఉండగానే రానాకి సంబంధించిన టాప్ సీక్రెట్స్ ని అగ్రనిర్మాత డి.సురేష్ బాబు రివీల్ చేశారు. రానాకి `అమర చిత్రకథ` లాంటి కామిక్ సిరీస్ లో నటించాలనుందని దానికోసం భారీగా విజువల్ గ్రాఫిక్స్ టీమ్ తో ప్రయోగాలకు శ్రీకారం చుడుతున్నాడని వెల్లడించారు. అదొక్కటేనా.. గుణశేఖర్ సారథ్యంలో అతడి టీమ్ తో కలిసి `హిరణ్యకసిప` లాంటి మరో భారీ చిత్రంలో నటిస్తున్నాడని తెలిపారు. రానా నటించే వన్నీ భవిష్యత్ లో బహుభాషా చిత్రాలేనని సురేష్ బాబు స్పష్టంగా తెలిపారు. వీటికోసం వందల కోట్ల పెట్టుబడుల్ని వెదజల్లనున్నారని తాజా సీన్ చెబుతోంది.

ఇదిలా ఉండగానే రానా మరో ప్రయోగం చేస్తున్నాడు. అతడు నటించే హిస్టారికల్ మూవీ `నీది నాది ఒకటే కథ` ఫేం వేణు ఉడుగుల దర్శకత్వంలో ఉంటుంది. 1992 కాలంలో జరిగిన ఓ రియల్ స్టోరి ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి `విరాటపర్వం 1992` అనే టైటిల్ ని ఫైనల్ చేశారని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని బహుభాషా చిత్రం(తెలుగు – తమిళం)గా అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కించనున్నారని తెలుస్తోంది. పూర్తిగా నైజాం యాసతో తెలంగాణ నేపథ్యంలో సాగే చారిత్రక కథాంశం ఇదని వెల్లడైంది. ప్రసాద్ చుక్కపల్లి – సుధాకర్ చెరుకూరిలతో కలిసి వేణు ఉడుగుల ఈ సినిమా కోసం పెట్టుబడులు సమకూరుస్తున్నారు. 2019 వేసవిలో ఈ చిత్రాన్ని ప్రారంభించనున్నారని తెలుస్తోంది. ఇదే కథను వేణు ఇదివరకూ పలువురు టాలీవుడ్ హీరోలకు వినిపించారు.. విజయ్ దేవరకొండ – కార్తీ – శర్వానంద్ పేర్లు వినిపించాయి. కానీ వీళ్లెవరితో కుదరకపోవడంతో రానాను ఫైనల్ చేశారని తెలుస్తోంది.
Please Read Disclaimer