ఈ అర్ధరాత్రి నుంచే రంగస్థలం

0మెగా ఫాన్స్ ఎప్పుడెప్పుడు ఈ రోజు గడుస్తుందా అని ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే హెచ్ డి క్వాలిటీతో కూడిన రంగస్థలం ఒరిజినల్ అఫీషియల్ వెర్షన్ ను రేపటి నుంచే అమెజాన్ ప్రైమ్ తన సైట్ లో అందుబాటులో ఉంచనుంది. అంటే రాత్రి 12 తర్వాత ఆన్ లైన్ లో ప్రత్యక్షం అయిపోతుంది. సోషల్ మీడియాలో ఇప్పటికే దీని గురించి విస్తృతంగా ప్రచారం చేసారు. ఒకవైపు థియేటర్లలో వసూళ్లు వస్తున్న టైంలోనే ఇలా పెట్టేయడం ఇబ్బందిగా ఉన్నా ఇది నిర్మాతలు విడుదలకు ముందు చేసుకున్న ఒప్పందం కావడంతో మార్చే అవకాశం లేకుండా పోయింది. రంగస్థలం అర్ధశతదినోత్సవానికి ఇంకా నాలుగు రోజులు టైం ఉంది. రెండు వందల కోట్ల గ్రాస్ దాటేసి భీభత్సమైన వసూళ్లు రాబట్టిన రంగస్థలం ఇంకా చాలా బిసి సెంటర్స్ లో స్ట్రాంగ్ గా ఉందని ట్రేడ్ రిపోర్ట్స్ ఉన్నాయి. ఈ నేపధ్యంలో ఆన్ లైన్ లో ఇలా ఒరిజినల్ వెర్షన్ పెట్టేయడం పూర్తిగా కాకపోయినా కొంత మేర ప్రభావం అయితే ఖచ్చితంగా చూపిస్తుంది. ఈ రోజు విడుదల చేసిన జిగేలు రాణి వీడియో సాంగ్ తో మొత్తం ఐదు పాటలు యు ట్యూబ్ లో లహరి సంస్థ ద్వారా ఈ పాటికే అందుబాటులో ఉన్నాయి.

భారీ మొత్తం వెచ్చించి హక్కులు కొన్న అమెజాన్ ప్రైమ్ రంగస్థలం స్ట్రీమింగ్ సరికొత్త రికార్డులు సృష్టిస్తుంది అనే నమ్మకంతో ఉంది. క్రేజీ సినిమాలన్నీ తన ఖాతాలో ఉండటంతో సౌత్ ఇండియా నుంచి అధిక శాతం సబ్స్క్రైబర్స్ వస్తారనే అంచనాలో ఉంది. అమెజాన్ ప్రైమ్ లో సినిమాలు చూడటం ఉచితం కాదనే సంగతి తెలిసిందే. జస్ట్ వెయ్యి రూపాయలు చెల్లిస్తే ఏడాది పాటు అపరిమితంగా అందులో ఉన్న అన్ని బాషా సినిమాలు ఫ్రీగా చూసే అవకాశం కలుగుతుంది. కాకపోతే డౌన్ లోడ్ చేసుకుని ఇతరులకు షేర్ చేసుకునే సౌకర్యం మాత్రం ఉండదు. అమెజాన్ ప్రైమ్ ఇప్పటి దాకా విడుదల చేసిన అర్జున్ రెడ్డి-భాగమతి-రాజు గారి గది 2 లాంటి వాటి రికార్డ్స్ అన్ని రంగస్థలం ఈజీగా ఓవర్ టెక్ చేస్తుంది. అందులో డౌట్ అక్కర్లేదు. అన్నట్టు నెక్స్ట్ అమెజాన్ లిస్టు లో భరత్ అనే నేను కూడా ఉంది. అది కూడా ఇలాగే ఖచ్చితంగా 45 రోజుల గడువు మీద విడుదల చేస్తారని టాక్. సో చిట్టిబాబుని మంచి క్వాలిటీతో మీ స్మార్ట్ ఫోన్ లోనో లేక లాప్ టాప్ లోనో చూడాలంటే అమెజాన్ ప్రైమ్ ఓపెన్ చేసుకుని రెడీ గా ఉండండి. సౌండ్ ఇంజనీర్ మీ ఇంట్లోనే సందడి చేయబోతున్నాడు.