వీధిన పడి తనీష్ గ్యాంగ్ వార్

0తనీష్ వాలకం చూస్తుంటే ఈసారి ఏదో చేసేట్టే ఉన్నాడు! అతడు వీధినపడి గ్యాంగ్ వార్ లతో చెలరేగిపోతున్నాడు. రౌడీలా మారాడు. దొరికినవాళ్లను – దొరకని వాళ్లను కలిపి చితక్కొడుతున్నాడు. వెంటాడి వేటాడుతున్నాడు. అతడిలో మునుపటితో పోలిస్తే చాలానే కసి కనిపిస్తోంది. లంచం తీసుకోని పోలీస్ స్టేషన్ ఉందా? ఉంటే చెప్పండి.. అక్కడికే వెళ్లి లొంగిపోతా! అంటూ ఎంతో ఎమోషన్ అయ్యాడు. ఇదంతా చూస్తుంటే తనీష్ కి పూనకం వచ్చినట్టే కనిపిస్తోంది. అసలే బిగ్ బాస్ హౌస్ లో అదరగొట్టేస్తున్న తనీష్ ఇప్పుడు వెండితెర కెరీర్ పైనా సీరియస్ గానే దృష్టి సారించినట్టు అర్థమవుతోంది. “నైటుకు నైటు పెద్ద స్టార్వయిపోయావు తమ్ముడు విజయవాడలో“ అని పోసాని అంతటివాడే కితాబిచ్చాడంటే తనీష్ లోని రౌడీయిజాన్ని అర్థం చేసుకోవాలి. “నిన్ను తప్ప ఇంకెవరినీ చేసుకోను“ అని చెప్పిన హీరోయిన్ కోసమే ఇలా రౌడీగా మారాల్సొచ్చిందా?

సినీకెరీర్ లో గ్యాప్ తర్వాత బిగ్ బాస్ తనీష్ కి ఎంతో కొంత కలిసొచ్చింది. మర్చిపోతున్న టైమ్ లో జనాలకు చేరువ చేసింది. అందుకే ఇదే సరైన సమయం అని భావించిన టీమ్ తనీష్ నటిస్తున్న `రంగు` ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ ఆద్యంతం బెజవాడ రౌడీయిజం కనిపిస్తోంది. వర్మ శైలిలోనే నేచురల్ గా రౌడీయిజాన్ని చూపించడం ఆకట్టుకుంది. ముఖ్యంగా విజువల్స్ ఆద్యంతం తనీష్ లోని ఎమోషన్ కట్టిపడేస్తోంది. ఈ చిత్రానికి వి.కార్తికేయ దర్శకత్వం వహిస్తున్నారు.

కొంత గ్యాప్ తర్వాత హిట్టుకోసమే తనీష్ తపన. దీనిని అర్థం చేసుకుని ఒక్క బ్లాక్ బస్టర్ ఇస్తే చాలు అతడి కెరీర్ కి బూస్ట్ దొరికినట్టే. ఇలాంటి కీలక సమయంలో `రంగు` తనకు ఎలాంటి బ్రేక్ నిస్తుందో చూడాలి. యువహీరోలో రోషం పౌరుషాన్ని ఎలివేట్ చేస్తూ తీసిన `రంగు` త్వరలోనే రిలీజ్ కి వస్తోంది. ఇంతకీ తనీష్ కి రంగు పడుతుందా? తనీష్ వల్ల బాక్సాఫీస్ కి పడుతుందా? అన్నది కాస్త వేచి చూడాలి.