ప్రభావతి.. వర్ష.. అన్నిసార్లూ రావు

0



‘తొలి ప్రేమ’ ముందు వరకు రాశి ఖన్నా వేరు. ఆ సినిమా తర్వాత రాశి ఖన్నా వేరు. అంతకుముందు వరకు ఆమెను ఒక రెగ్యులర్ కమర్షియల్ హీరోయిన్ గానే చూసేవాళ్లు. కానీ ‘తొలి ప్రేమ’లో వర్ష పాత్రలో అద్భుతమైన పెర్ఫామెన్స్ తో ప్రేక్షకుల మనసులు కొల్లగొట్టింది రాశి. అందం.. అభినయం రెంటితోనూ ఆకట్టుకుని ఆమె ఒక్కసారిగా యూత్ లో మాంచి ఫాలోయింగ్ సంపాదంచుకుంది. ఈ సినిమా తర్వాత రాశి నుంచి ఇలాంటివే మరిన్ని పాత్రలు ఆశిస్తున్నారు అభిమానులు. కానీ రాశి మాత్రం తనకు ఏ అవకాశం వస్తే దాన్నే అంగీకరిస్తోంది. ఇదే విషయమై ఒక అభిమాని రాశిని సోషల్ మీడియాలో ప్రశ్నించాడు. ‘తొలి ప్రేమ’ తరహా సినిమాలు రావట్లేదేంటి.. మళ్లీ రెగ్యులర్ గ్లామర్ క్యారెక్టర్లే చేస్తున్నారేంటి అని అడిగాడు. దీనికి రాశి ఆసక్తికర సమాధానం ఇచ్చింది.

ఏ ఆర్టిస్టు కూడా స్క్రిప్టును ఎంచుకోరని.. స్క్రిప్టే వాళ్లను ఎంచుకుంటుందని రాశి చెప్పింది. ‘ఊహలు గుసగుసలాడే’ ప్రభావతి పాత్ర అయినా.. ‘తొలి ప్రేమ’లో వర్ష క్యారెక్టర్ అయినా.. అనుకోకుండా.. అరుదుగా వస్తాయని.. అలాంటి పాత్రలు ఎప్పుడూ రావాలని కోరుకుంటే కష్టమని ఆమె స్పష్టం చేసింది. మన దగ్గరికి వచ్చే పాత్రల్లోంచి మంచివి ఎంచుకుంటామని.. తనకు ఇప్పుడు వస్తున్న అవకాశాల పట్ల సంతోషంగానే ఉన్నానని ఆమె స్పష్టం చేసింది. రాశి అన్నది అక్షరాలా నిజం. ఈ తరహా పాత్రలే చేస్తానని కూర్చుంటే కెరీర్ ముందుకు సాగకపోవచ్చు. ఎలాంటి పాత్రలో అయినా ప్రత్యేకత చూపిస్తుంటే.. కొంచెం సెలక్టివ్ గా ఉంటూ క్యారెక్టర్లు ఎంచుకుని సత్తా చాటుకుంటే.. రెపుటేషన్ ఆటోమేటిగ్గా పెరుగుతుంది. నయనతార.. అనుష్క.. సమంత.. లాంటి వాళ్లు ఇలాగే తమ ఇమేజ్ ను పెంచుకున్నారు. అద్భుతమైన పాత్రలు వాళ్లను వెతుక్కుంటూ వచ్చాయి. వాళ్లను మిగతా హీరోయిన్ల ముందు భిన్నంగా నిలబెట్టాయి. రాశి కూడా ఆ కోవలోకే చేరుతుందేమో చూద్దాం.