మేడమ్ మేడమ్.. మా సినిమాలో చేయండి

0‘అర్జున్ రెడ్డి’ అగ్రెసివ్ హీరో క్యారెక్టర్ తర్వాత ‘గీత గోవిందం’లో మృదు స్వభావిగా.. భయస్తుడిగా మారిపోయిన విజయ్ దేవరకొండ ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరిచాడు. అతడి నటన సినిమాకు హైలైట్ గా నిలిచింది. అలాగని హీరోయిన్ రష్మిక మందన్నా ఏమీ తక్కువ తినలేదు. విజయ్ కి దీటుగా నటించి మెప్పించింది. విడుదలకు ముందు నిర్మాత అల్లు అరవింద్ అన్నట్లు విజయ్ దేవరకకొండ ముందు హీరోయిన్ ఉనికిని చాటుకోవడం అంత సులువేమీ కాదు. ఐతే రష్మిక ఆ విషయంలో విజయవంతమైంది. తెరమీద రష్మిక కాకుండా గీత మాత్రమే కనిపించడమే ఆమె ఎలా నటించిందో చెప్పడానికి ఉదాహరణ. తెలుగులో రష్మికకు వరుసగా రెండో విజయమిది. నిజానికి ఆమె తొలి సినిమా ‘ఛలో’లో నామమాత్రమైన పాత్ర. సినిమా హిట్టయింది కానీ.. రష్మికకు అదేమంత పేరు తెచ్చిపెట్టలేదు. కానీ ‘గీత గోవిందం’ అలా కాదు.

ఈ సినిమాతో రష్మికకు సూపర్ క్రేజ్ వచ్చింది. ‘గీత గోవిందం’లో హీరో మేడమ్ మేడమ్ అని ఆమె వెంటపడినట్లు.. రష్మికను తమ సినిమాల్లో కథానాయికగా నటింపజేయడానికి నిర్మాతలు పోటీ పడుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో రష్మిక తన రెమ్యూనరేషన్ కూడా ఒక్కసారిగా పెంచేసినట్లు సమాచారం. ఐతే గత ఏడాది ‘ఫిదా’ తర్వాత సాయి పల్లవికి కూడా ఇలాంటి క్రేజే వచ్చింది. కానీ క్యారెక్టర్ ప్రాధాన్యం విషయంలో సాయిపల్లవి మరీ పట్టుదలతో ఉండటం.. ఆమె యాటిట్యూడ్ కూడా సరిగా ఉండదని ప్రచారం జరగడంతో కెరీర్ ఆశించిన స్థాయిలో ఊపందుకోలేదు. కానీ రష్మిక ఆ బాటలో నడిచేలా కనిపించడం లేదు. కొంచెం లిబరల్ గా ఉంటున్నట్లు తెలుస్తోంది. ఆమె గురించి అందరూ చాలా పాజిటివ్ గా మాట్లాడుతున్నారు. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న రష్మిక సినిమాలు ‘దేవదాస్’.. ‘డియర్ కామ్రేడ్’ కూడా బాగా ఆడితే ఆమె రేంజే మారిపోతుందేమో.