అక్కడ తిడుతున్నారు.. ఇక్కడ ఎత్తేస్తున్నారు

0గీత గోవిందం’ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని ఖాతాలో వేసుకున్న రష్మిక మందన్నా విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది. వేరే భాషలో వచ్చి ఇలాంటి విజయాన్నందుకున్న ఆమెకు ఇక్కడి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతుంటే.. సొంత భాషకు చెందిన ఫ్యాన్స్ మాత్రం ఆమెపై మండిపడుతున్నారు. తొలి సినిమా ‘కిరిక్ పార్టీ’తో తిరుగులేని పేరు సంపాదించిన రష్మిక.. ఆ చిత్ర కథానాయకుడు.. నిర్మాత రక్షిత్ శెట్టితో వెంటనే నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. కానీ తర్వాత తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి ఇక్కడ వరుసగా రెండు విజయాలందుకుని కథానాయికగా స్టార్ స్టేటస్ సంపాదించిన రష్మిక.. అనూహ్యంగా రక్షిత్ నుంచి విడిపోవాల్సి వచ్చింది. కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారాన్ని నిజం చేస్తూ రక్షిత్ కు ఆమె బ్రేకప్ చెప్పేసిందని స్పష్టమైంది.

ఐతే ‘గీత గోవిందం’ సినిమాలో విజయ్ దేవరకొండతో లిప్ లాక్ చేసినపుడే కన్నడ ప్రేక్షకులు ఆమెపై మండి పడ్డారు. అప్పుడే బ్రేకప్ రూమర్లు గుప్పుమన్నాయి. ఇప్పుడు ఆ ప్రచారమే నిజం కావడంతో రష్మికను టార్గెట్ చేసుకుని పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. బూతులు తిట్టేస్తున్నారు. ఆమెను ఏమీ అనొద్దని రక్షిత్ కోరినా వాళ్లు తగ్గట్లేదు. కన్నడ ఇండస్ట్రీ జనాలు సైతం రష్మికపై ఆగ్రహంతో ఉన్నారట. వాళ్లు కూడా అంతర్గత చర్చల్లో ఆమెను తిట్టిపోస్తున్నారట. రష్మికకు అక్కడ అవకాశాలు కూడా ఆగిపోయాయి. అదే సమయంలో టాలీవుడ్లో ఆమె ఊపు మామూలుగా లేదు. ‘గీత గోవిందం’ తర్వాత హాట్ ప్రాపర్టీ అయిపోయింది రష్మిక. ఆమె తర్వాతి చిత్రం ‘దేవదాస్’కు మంచి హైప్ వచ్చింది. ఇందులో రష్మిక ఎలా ఉంటుందా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు విజయ్ దేవరకొండతోనే మళ్లీ రష్మిక జత కడుతున్న ‘డియర్ కామ్రేడ్’ మీదా భారీ అంచనాలున్నాయి. ఇంకోవైపు రష్మిక మూణ్నాలుగు క్రేజీ ప్రాజెక్టుల్లో అవకాశాలు వస్తున్నట్లు సమాచారం. అందులో రష్మిక తొలి తెలుగు సినిమా ‘ఛలో’ను డైరెక్ట్ చేసిన వెంకీ కుడుముల తీయబోయే రెండో సినిమా కూడా ఉన్నట్లు సమాచారం. నితిన్ హీరోగా తెరకెక్కే ఈ చిత్రంలో రష్మిక కథానాయికగా ఫిక్సయినట్లు తెలుస్తోంది. ఇంకొన్ని రోజుల్లోనే మిగతా ప్రాజెక్టుల వివరాలు కూడా వెల్లడవుతాయి.