రేస్ గుర్రం విలన్ యమా స్పీడు

0అనుకుంటాం కానీ సినిమా పరిశ్రమలో అదృష్టం ఏ వైపు నుంచి పలకరిస్తుందో చెప్పడం కష్టం. ఒక్క రోజులో పతనాన్ని చూపిస్తే మరో రోజులో సింహాసనంపై కూర్చోబెడుతుంది. ఇక్కడ తెలివిగా అవకాశాలు ఒడిసిపట్టుకునే వాళ్లే విజేతలుగా నిలుస్తారు. రేస్ గుర్రం విలన్ రవి కిషన్ దీనికి ఉదాహరణగా నిలుస్తున్నాడు. తెలుగులో విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వరస అవకాశాలు కొట్టేస్తున్న రవి కిషన్ వచ్చింది భోజ్ పూరి నుంచి. అక్కడ అతను స్టార్ హీరో. కాకపోతే అక్కడి బడ్జెట్లు పరిమితంగా ఉండటంతో పారితోషికాలు తక్కువగా ఉంటాయి కాబట్టి మనోడు బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ మీద కన్నేసి సక్సెస్ అయ్యాడు. అయినా కూడా రవి కిషన్ కు అక్కడ డిమాండ్ బాగా ఉంది. అందుకే ఇలాంటి టాలెంటెడ్ హీరోలను భోజ్ పూరి నుంచి పక్కకు వెళ్లకుండా చేసేందుకు జీ సంస్థ నడుం బిగించింది. అందులో భాగంగా రవి కిషన్ తో ఏకంగా 7 సినిమాలు చేసేందుకు ఒప్పందం కుదిరిందట. అన్ని భోజ్ పూరిలోనే ఉంటాయని సమాచారం.

ఇవి మొత్తం పూర్తవ్వడానికి మూడేళ్ళ సమయం పడుతుంది కాబట్టి ఆ మేరకు రవి కిషన్ డేట్స్ బ్లాక్ చేసుకుని వరుసగా సినిమాలు నిర్మించేందుకు ప్లానింగ్ లో ఉంది జీ టీమ్. అవి మొదలయ్యే లోపు క్రిష్ మణికర్ణికతో పాటు పలు తమిళ తెలుగు సినిమాల్లో బిజీగా ఉన్న రవి కిషన్ వాటిని పూర్తి చేసుకుని తన మాతృ బాషవైపు వెళ్ళిపోతాడు. భోజపూరి లో ఎక్కువగా మసాలా సినిమాలు వస్తుంటాయి. వాళ్ళ ఛానల్స్ గమనిస్తే మన తెలుగు తమిళ సినిమాల పాటలనే వాళ్ళ భాషలో రీ కంపోజ్ చేసి ఊర మాస్ గా చిత్రీకరిస్తూ ఉంటారు. అందులో హీరో హీరోయిన్ల వేషధారణ కూడా ఒకరకమైన గమ్మత్తుగా ఉంటుంది. ఈ స్టాండర్డ్ ని మార్చాలి అనేదే జీ సంస్థ ఉద్దేశం. అందుకే స్టార్ ఇమేజ్ ఉన్న రవి కిషన్ లాంటి హీరోతో సినిమాలు తీస్తే ఆదరణతో పాటు వసూళ్లు కూడా వస్తాయని తద్వారా మిగిలిన వారికి కూడా ఎలాంటి సినిమాలు తీయాలి అనే స్ఫూర్తి కలుగుతుందని ఇలా ప్లాన్ చేశారట. కాకపోతే ఇంత పెద్ద టాస్క్ లో కీలక పాత్ర పోషించబోతున్న రవికిషన్ కు ఎంత పారితోషికం ముట్టజెప్పబోతున్నారు అనే విషయం మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్.