రవితేజ మారతాడా.. మారుస్తాడా?

0టాలీవుడ్లో రొటీన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిపోయాడు రవితేజ. అందులోనూ ఈ ఏడాది అతడి నుంచి వచ్చిన ‘టచ్ చేసి చూడు’.. ‘నేల టిక్కెట్టు’ మరీ రొటీన్ గా ఉండటంతో ప్రేక్షకులు వాటిని దారుణంగా తిప్పికొట్టారు. కనీస ఓపెనింగ్స్ కూడా కరవై రవితేజ కెరీర్లోనే అత్యంత భారీ నష్టాలు మిగిల్చిన సినిమాలుగా ఇవి నిలిచాయి. వీటి వల్ల రవితేజ మార్కెట్ బాగా దెబ్బ తినేసింది. రవితేజ ఇలా మాస్ సినిమాలకే పరిమితం అయిపోవడానికి కారణాలు లేకపోలేదు. గతంలో కొంచెం డిఫరెంటుగా ట్రై చేసిన ‘నా ఆటోగ్రాఫ్’.. ‘శంభో శివ శంభో’.. ‘సారొచ్చారు’ లాంటి సినిమాలు అతడికి చేదు అనుభవాన్ని మిగిల్చాయి. దీంతో కొత్తగా ట్రై చేస్తే తన సినిమాలు ఆడవని ఫిక్సయిపోయాడు మాస్ రాజా. అదే సమయంలో రొటీన్ సినిమాలతో ఎదురు దెబ్బలు తిన్న సందర్భాల్ని అతను మరిచిపోతున్నాడు.

రవితేజ నుంచి తర్వాత రాబోయే సినిమా ‘అమర్ అక్బర్ ఆంటోనీ’కి దర్శకుడు శ్రీను వైట్ల కావడంతో అందులోనూ కొత్తదనం ఉంటుందన్న ఆశలేమీ లేవు. ఐతే దీని తర్వాత అతను ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ దర్శకుడు వీఐ ఆనంద్ తో సినిమా కమిటయ్యాడు. ఈ చిత్రానికి ‘డిస్కో రాజా’ అనే టైటిల్ కూడా వినిపిస్తోంది. ఆనంద్.. మొదట్నుంచి భిన్నమైన సినిమాలే చేస్తున్నాడు. ‘ఒక్క క్షణం’ ఆడకపోయినా అది కూడా డిఫరెంట్ మూవీనే. మరి రవితేజ ఇప్పుడు తాను మారాల్సిన అవసరాన్ని గుర్తించి.. ఆ దర్శకుడి స్టయిల్లోనే కొత్తగా ఏమైనా ట్రై చేస్తాడా.. లేక అతడినే మార్చేసి తన దారిలోకి తీసుకొచ్చి మాస్ మసాలా సినిమా చేస్తాడా.. లేదంటే ఇది ఇద్దరి శైలీ కలిసి మధ్య రకంగా ఉంటుందా అన్నది ఆసక్తికరం. మామూలుగా అయితే డౌటొచ్చేది కాదు కానీ..‘డిస్కో రాజా’ అనే టైటిల్ చూస్తే మాత్రం సందేహాలు కలుగుతున్నాయి.