రానా బంగారు చెవి సీక్రెట్ బయట పడింది!

0Rana-ear-bling-in-Nene-Rajuఈ మధ్య కాలంలో ప్రేక్షకుల దృష్టిని బాగా ఆకర్షించిన మీడియం రేంజి సినిమాల్లో ‘నేనే రాజు నేనే మంత్రి’ ఒకటి. దీని టైటిల్ లోగో కానీ.. పోస్టర్లు కానీ.. టీజర్ ట్రైలర్ కానీ.. ఇలా ప్రతి ఒక్కటీ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాయి. ‘నేనే రాజు నేనే మంత్రి’ పోస్టర్ ఒకదాంట్లో హీరో రానా దగ్గుబాటి చెవి పైన బంగారు తొడుగుతో కనిపించడం గమనించే ఉంటారు. ఏంటా తొడుగు అన్న చర్చ సోషల్ మీడియాలో జరిగింది. ఇండస్ట్రీలో కూడా రకరకాల ఊహాగానాలు వినిపించాయి.

ఐతే తాజా సమాచారం ఏంటంటే.. సినిమాలో ఆ తొడుగుకు సంబంధించిన సీన్ కీలంగా ఉంటుందట. ఒక చోట హీరోగా అటాక్ జరగడం.. తుపాకీ తూటా అతడి చెవి మీదుగా దూసుకెళ్లడం జరుగుతుందట. ఆ దాడితో చెవి కొంచెం లేచిపోతే.. దానికి బంగారు తొడుగు వేయించుకుంటాడట హీరో. దాన్ని చూసినపుడల్లా శత్రువులు గుర్తుకురావాలని.. వారిపై ఆధిపత్యం చలాయించాలన్న కోరిక రగులుతూనే ఉండాలని హీరో ఆ తొడుగు వేయించుకుంటాడట. ఇదీ ఆ బంగారు తొడుగు తాలూకు కథ.

సాధారణ నేపథ్యం నుంచి సీఎం పీఠం మీదికి చేరే యువకుడి పాత్రలో కనిపించబోతున్నాడు రానా ‘నేనే రాజు నేనే మంత్రి’లో. తన గత సినిమాలకు పూర్తి భిన్నంగా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఈ కథను తీర్చిదిద్దుకున్నాడు తేజ. రానా తండ్రి సురేష్ బాబే ఈ చిత్రానికి నిర్మాత. ఆగస్టు 11న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశాలున్నాయి. రానా సరసన కాజల్ అగర్వాల్.. కేథరిన్ థ్రెసా నటించారు.