హీరోలతో ఆమెకు గొడవ అక్కడే మొదలవుతుందట!

0సక్సెస్ లో ఉన్న హీరోయిన్ల మీద వచ్చే వార్తలకు భిన్నమైన వార్తల్లో నిలుస్తోంది ఫిదా ఫేం సాయి పల్లవి. అందచందాలతో కాకుండా తన చలాకీతనంతో.. నటనతో ప్రేక్షకుల మనసుల్ని దోచుకుంటున్న ఆమె.. తరచూ చిత్రమైన అంశాలకు సంబంధించి వార్తల్లో దర్శనమివ్వటం ఆసక్తికరంగా మారింది.

టాలీవుడ్ లోని మరే నటికి లేని ఇబ్బంది అంతా సాయిపల్లవికే అన్న మాట ఇప్పుడు కొందరి నోటి నుంచి వినిపిస్తోంది. దీనికి తగ్గట్లే మరో నటుడితో సాయిపల్లవి గొడవ పడిందన్న వార్తలు బయటకు వచ్చాయి. ఒక సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యాక అవకాశాలు వెల్లువలా వచ్చి పడతాయి. ఇలాంటివేళ.. డిమాండ్ కు తగ్గట్లుగా అవకాశాల్ని ఒప్పుకోవటం మామూలే.

దీనికి భిన్నంగా సాయి పల్లవి మాత్రం ఆచితూచి మరీ సినిమాల్ని ఎంపిక చేసుకుంటోంది. తన పాత్ర నచ్చని పక్షంలో. పెద్ద పెద్ద అవకాశాల్ని సైతం వదులుకుంటోంది. ఈ తీరు చాలామందికి ఒక పట్టాన మింగుడు పడటం లేదు. ప్రముఖ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో కాట్రు వెలియిడై మూవీని మొదట ఒప్పుకొని తర్వాత గ్లామర్ పాత్రలో తాను నటించేది లేదని కరాఖండిగా చెప్పేసి ఆ మూవీని రిజెక్ట్ చేసేశారు.

అంతేకాదు.. కొందరు పెద్ద హీరోలతో నటించేందుకు సైతం ఆమె ఒప్పుకోలేదు. నాగశౌర్యతో ఆమె గొడవ పడటంతో మొదలైన తగాదాల పర్వం నేటికీ కొనసాగుతోంది. సాయిపల్లవితో తనకు గొడవ జరిగిన విషయాన్ని అతగాడు ఓపెన్ గానే చెప్పేశాడు. శర్వానందతో ప్రస్తుతం చేస్తున్న మూవీలోనూ అతడితో ఘర్షణ పడినట్లుగా తెలుస్తోంది. అంతకు ముందు నానితో చేసిన మూవీలోనూ సాయిపల్లవికి గొడవ అయినట్లుగా తెలుస్తోంది.

ఇంతకీ తాను పని చేసే ప్రతి నటుడితోనూ సాయి పల్లవికి గొడవ ఎందుకు? అన్న ప్రశ్నకు ఆసక్తికర సమాధానం వినిపిస్తోంది. తన షాట్ అయిపోయిన వెంటనే నేరుగా తన కార్ వాన్ లోకి వెళ్లి కూర్చుంటుందని.. ఎవరితోనూ పెద్దగా మాట్లాడదని చెబుతున్నారు. అంతేకాదు.. నటుల పక్కన కుర్చీలో కూర్చునేందుకు సైతం సాయిపల్లవి ఇష్టపడదని.. దీన్ని వారు అవమానంగా భావిస్తుంటారని చెబుతున్నారు. ఇదే.. హీరోలతో ఫిదా పోరికి వచ్చే గొడవగా చెబుతున్నారు.