జియో బంపరాఫర్: మరో ఏడాదిన్నర ఫ్రీ!

0jioమార్కెట్‌లోకి జియో ప్రవేశంతో టెలికం రంగంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయి. అప్పటి వరకు వినియోగదారులను జలగల్లా పట్టి పీడించిన ఇతర టెలికమ్ కంపెనీలు జియో దెబ్బకు అమాంతం దిగివచ్చాయి. మొదటి ఆరు మాసాలు ఉచిత సేవలు అందించిన జియో తన వ్యాపార ప్రత్యర్థులను కోలుకోలేని దెబ్బతీయడానికి మరో కీలక నిర్ణయం దిశగా ముందడుగేసినట్లు సమాచారం. ప్రస్తుతం అందిస్తోన్న ఉచిత, డిస్కౌంట్ ఆఫర్లను మరో 12 నుంచి 18 నెలల వరకు కొనసాగించాలని భావిస్తున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం.

జియో ప్రభావంతో వినియోగదారులను ఆకట్టుకోడానికి ప్రభుత్వ రంగ టెలికమ్ సంస్థ బీఎస్ఎన్ఎల్, ప్రైవేట్ సంస్థలు ఐడియా, వొడాఫోన్, ఎయిర్‌టెల్ లాంటి దిగ్గజాలు కూడా ఆఫర్లను ప్రకటించాయి. ఇవి ఆర్థిక భారంతో కూడుకున్నప్పటికీ తప్పనిసరి పరిస్థితుల్లో వేరే దారి లేక ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. అయితే వీటిని ఎక్కువ కాలం కొనసాగించడం కష్ట సాధ్యం. ఈ అవకాశాన్ని తనకు అనుకూలంగా మలచుకునేందుకు జియో ప్రయత్నిస్తోంది. మరో ఏడాది పాటు అన్‌లిమిటెడ్ ఆఫర్లను ఇతర సంస్థలు భరించలేవు కాబట్టి… ఆ పనిని తామే చేసి, ప్రత్యర్థులను కోలుకోని విధంగా దెబ్బ తీయాలని భావిస్తోంది. దీనిపై అధికారింగా ప్రకటించే అవకాశం ఉందని వర్గాలు పేర్కొంటున్నాయి. ఇదే నిజమైతే జియో వినియోగదారులకు మరో ఏడాది నుంచి ఏడాదిన్నర వరకు పండగే.

2016 సెప్టెంబరు 5 న ప్రారంభమైన జియో కేవలం 83 రోజుల్లో 5 కోట్ల వినియోగదారుల్ని, 170 రోజుల్లో 10 కోట్ల వినియోగదారుల్ని సొంతం చేసుకుంది. అంటే సగటున రోజుకు 6 లక్షల మంది వినియోగదారులు జియోలో చేరారు. ప్రపంచంలో అతిపెద్ద నెట్‌‌వర్క్ సంస్థగా ఆవిర్భవించిన జియో, రానున్న నెలల్లో లక్ష మొబైల్ సైట్లను ప్రారంభించాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఈ విషయాలను అమెరికాకు చెందిన మోర్గాన్ స్టాన్లీ పేర్కొంది.