మరో భారీ సంచలనం దిశగా జియో!

0Jio-Set-Top-Boxమార్కెట్లోకి నిత్యం చాలానే వస్తువులు.. వస్తుసేవల ఉత్పత్తులు వస్తుంటాయి. కానీ.. కొన్నింటి కోసం మాత్రం రోజువారీ పనులన్నింటిని ఆపేసుకొని మరీ.. రోడ్ల మీద బారులు తీరే క్యూలలో నిలుచోక తప్పని పరిస్థితి ఉంటుంది. ఇటీవల కాలంలో అలాంటి పరిస్థితిని కల్పించింది రిలయన్స్ జియో. డేటా వినియోగంలో సగటు జీవి మైండ్ సెట్ ను పూర్తిగా మార్చేసిన ఘనత జియోకే దక్కిందని చెప్పాలి.

ఫ్రీ డేటా ఆఫర్ తో జియో సృష్టించిన సంచలనం అంతాఇంతా కాదు. ఆ సిమ్ కోసం పడిన పాట్లు అన్నిఇన్ని కావు. టెలికం రంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలకటమే కాదు.. జియో పుణ్యమా అని.. డేటా వినియోగం భారత్ లో భారీగా వృద్ధిరేటు సాధించి.. ప్రపంచంలోనే టాప్ వన్ దిశగా దూసుకెళుతున్న పరిస్థితి. ప్రత్యర్థులకు మంట పుట్టించే ఆఫర్లతో విరుచుకుపడే జియో.. ఫేజ్ టూలోకి వెళ్లనుందా? అంటే అవుననే మాటను చెబుతున్నాయి మర్కెట్ వర్గాలు.

ఇంతకాలం డేటా వినియోగంతో సంచలనాల మీద సంచలనాలు సృష్టించిన జియో.. మరికొద్ది రోజుల్లో మరో సంచలనానికి తెర తీయనున్నట్లు చెబుతున్నారు. త్వరలో ఇంటర్నెట్ ప్రోటోకాల్ టెలివిజన్ ప్రసారాల్ని ప్రారంభించనున్నట్లుగా చెబుతున్నారు. అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడనప్పటికీ.. ఆన్ లైన్లో లీకైన సెట్ అప్ బాక్స్ను చూస్తే.. జియో త్వరలో సెటప్ బాక్సుల రంగంలోకి అడుగుపెట్టనున్న విషయం అర్థమవుతుంది.

డీటీహెచ్ సర్వీసులు అందిస్తున్న సంస్థలు భారీగా ఛార్జీలు మోత మోగిస్తున్న వేళ.. రిలయన్స్ జియో కానీ ఎంటర్ అయితే.. మొత్తం సీన్ మారిపోతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఉచితంగా సెట్ టాప్ బాక్స్ లతో పాటు.. డీటీహెచ్ ఆపరేటర్ల కంటే దాదాపు 40 నుంచి 50 శాతం తక్కువ ధరలకే నాణ్యమైన సేవల్ని అందించే దిశగా జియో ప్లాన్ చేస్తున్నట్లు చెబుతున్నారు. అదే జరిగితే.. సిమ్ ల కోసం ఎలా అయితే.. రోడ్ల మీద క్యూలలో నిలుచోవాల్సి వచ్చిందో.. మరోసారి సెట్ టాప్ బాక్సుల కోసం రోడ్ల మీద బారులు తీరాల్సి రావొచ్చన్న మాట వినిపిస్తోంది. అదే జరిగితే.. డీటీహెచ్ రంగంలో పెను సంచలనంగా మారటమే కాదు.. డీటీహెచ్ సేవలకు చెల్లిస్తున్న మొత్తంలోనూ మార్పులు రావటం ఖాయమన్న మాట వినిపిస్తోంది. మరి.. అదెప్పుడు జరుగుతుందో చూడాలి.