జియో ఆఫర్‌ అయిపోతుంది, తర్వాత ఏంటి?

0jioరిలయన్స్‌ జియో.. ఈ పేరు వింటేనే టెలికాం మార్కెట్‌లోకి కంపెనీల గుండెల్లో గుబేలుమంటోంది. సెప్టెంబర్‌ లాంచ్‌ అయిన ఈ సర్వీసులను కంపెనీ మొదటి ఆరునెలలు ఉచితంగా అందించింది. అంతేకాక ప్రమోషనల్‌ ముగిసినప్పటికీ తన ఉచిత సర్వీసులను అతితక్కువ ధరల్లో జియో అందిస్తూనే ఉంది. హ్యాపీ న్యూయర్‌, సమ్మర్‌ సర్‌ప్రైజ్‌, ధన్‌ ధనా ధన్‌ ఆఫర్ల పేర్లతో వినియోగదారులను మైమరిపిస్తోంది. అయితే జియో సమ్మర్‌ సర్‌ప్రైజ్‌, ధన్‌ ధనా ధన్‌ ఆఫర్లు ఇంకా కొన్ని వారాల్లో ముగుస్తున్నాయి. అతి తక్కువ ధరలకు జియోసేవలను పొందిన కస్టమర్లకు ఇక గండి పడనుంది. జియో ఆఫర్ల గడువు ఈ నెల చివరితో ముగుస్తుండటంతో తర్వాత పరిస్థితి ఏమిటని మార్కెట్లో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

ఇప్పటివరకు కంపెనీ కూడా ఎలాంటి కొత్త ప్రమోషనల్‌ ఆఫర్‌ను ప్రకటించలేదు. ఈ రెండు ఆఫర్లను కలిగిఉన్న వారిపై ఈ డెడ్‌లైన్‌ ప్రభావం కూడా భారీగానే పడనుంది. ఏప్రిల్‌ నెలలో సమ్మర్‌ సర్‌ప్రైజ్‌ ఆఫర్‌ను కంపెనీ ప్రకటించింది. ఆ నెల 15వ తేదీ లోపు రూ.303 లేదా రూ.499తో రీచార్జి చేసుకునే జియో యూజర్లు ఆ ప్యాక్‌లను నెల రోజుల పాటు కాకుండా 3 నెలల వరకు వాడుకునే అవకాశం కల్పించింది. 90 రోజుల గడువు పూర్తయిన తర్వాత రూ.303 లేదా రూ.499 రీఛార్జ్‌తో మరో 28 రోజుల పాటు ఈ సర్వీసులను వాడుకోవచ్చు. అంటే జూలై 30వరకు ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయి. కానీ తర్వాత ఇక ఎలాంటి ఆప్షన్‌ ఉండదు.

కచ్చితంగా రూ.309 తో లేదా అంతకంటే ఎక్కువ మొత్తంతో రీఛార్జ్‌ చేసుకుని జియో సర్వీసులను వాడుకోవాల్సిందే. ఒకవేళ మీరు ముందస్తుగానే జియో ప్రైమ్‌ సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌ను యాక్టివేట్‌ చేసుకుని ఉండి, సమ్మర్‌ సర్‌ప్రైజ్‌ ఆఫర్‌ పొందడానికి రూ.303 రీఛార్జ్‌ చేసుకోవడం కంటే ముందస్తుగా రూ.149 తో లేదా అంతకంటే తక్కువ ప్యాక్‌తో రీఛార్జ్‌ చేసుకుని ఉంటే, తక్కువ విలువ కలిగిన ప్యాకేజే మీకు యాక్టివేట్‌ అవుతుంది. అంటే రూ.303 ప్లాన్‌ గడువు ముగియగానే, మీకు రూ.149 ప్యాక్‌ ఆటోమేటిక్‌గా యాక్టివేట్‌ అవుతుంది. ఒక్కసారి అది కూడా ముగిశాక, కచ్చితంగా రూ.309తో ప్రతినెలా రీఛార్జ్‌ చేసుకోవాలి.