రిలయన్స్‌ జియోకు ఎదురుదెబ్బ

0mukesh-ambani-jioటెలికాం మార్కెట్‌లో మిగతా కంపెనీలకు షాకిస్తూ దూసుకెళ్లున్న ముఖేష్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ జియోకు ఎదురుదెబ్బ తగిలింది. టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్‌ వ్యాపార ప్రకటనలకు వ్యతిరేకంగా జియో నమోదుచేసిన ఫిర్యాదును ముంబైలోని మెట్రోపాలిటన్‌ ఎస్ప్యానడే కోర్టు కొట్టిపారేసింది. దేశంలోనే అత్యంత వేగవంతమైన నెట్‌వర్క్‌గా ఎయిర్‌టెల్‌ తన వ్యాపార ప్రకటనల్లో చెప్పుకోవడం, కుట్ర విధానమని, నమ్మకానికి తూట్లు పొడవడమేనని రిలయన్స్‌ జియో ఆరోపించించింది. ఈ టెక్నాలజీ యుగంలో, ప్రతి సర్వీసు ప్రొవైడర్‌ లేదా మరే ఇతర వ్యాపారాలు నిర్వహించే సంస్థలైనా పోటీ వాతావరణంలో పనిచేస్తూ ఉంటాయని, తమ వ్యాపారాలను విస్తరించుకోవడానికి తమకు నచ్చిన ఉత్తమమైన పద్ధతిలో ప్రకటనలు ఇవ్వొచ్చని కోర్టు చెప్పింది. దీనిలో ఏం లేదు, కేవలం మార్కెటింగ్‌ పాలసీ మాత్రమేనని తేల్చిచెప్పేసింది.

ఈ సాంకేతిక యుగ ప్రపంచంలో ఏ సర్వీసు ప్రొవైడర్‌ అయినా తమ సర్వీసుల కోసం ఓ స్వతంత్ర ఏజెన్సీ నుంచి మంచి మెథడాలజీని ఎంపికచేసుకుంటారని, తర్వాత ఆ స్వతంత్ర ఏజెన్సీ ద్వారా అధికారికంగా ధృవీకరణ పత్రాన్ని కూడా పొందుతారని తెలిపింది. దీంతో ఫిర్యాదుదారులతో సహ ఏ ఒక్క పోటీదారునికి కూడా నష్టాలు రావని మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ కేజీ పాల్వేదవర్‌ చెప్పారు. భారతీ ఎయిర్‌టెల్‌ నెట్‌వర్క్‌ డేటా స్పీడులో తప్పుడు వ్యాపార ప్రకటనలను ఇస్తుందని గత మార్చిలో జియో ఆరోపించింది.

అడ్వర్‌టైజింగ్‌ స్టాండర్డ్స్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా వద్ద జియో తన ఫిర్యాదును దాఖలు చేసింది. ఎయిర్‌టెల్‌పై చర్యలు తీసుకోవలని కోరింది. దీనిపై విచారణ చేపట్టిన ఏఎస్‌సీఐ, ఈ ప్రకటనను ఉపసంహరించుకోవాలని ఎయిర్‌టెల్‌ను ఆదేశించింది. మళ్లీ జూన్‌లో కూడా ఈ ప్రకటనలను ఎయిర్‌టెల్‌ ఇస్తుండటంతో, జియో ముంబై మెట్రోపాలిటన్‌ కోర్టులో ఫిర్యాదుచేసింది. కేవలం ఓ స్వతంత్ర సంస్థ ఇచ్చిన సర్టిఫికేట్‌తో ఫిర్యాదుదారులకు లేదా ప్రజలకు ఎలాంటి నష్టం వాటిల్లదని ముంబై కోర్టు పేర్కొంది.