ఈ నెల 21న జియో 4జీ ఫీచర్ ఫోన్ విడుద‌ల‌..? ధర రూ.500లేనట..!

0Jio-phoneఉచిత హైస్పీడ్ 4జీ మొబైల్ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, ఎస్‌ఎంఎస్‌లతో ప్రత్యర్థి టెలికాం కంపెనీలకు రిలయన్స్ జియో కంటి మీద కునుకు లేకుండా చేసిన విషయం తెలిసిందే. దీంతో ఇతర టెలికాం సంస్థలు కూడా తమ వినియోగదారులు చేజారిపోకుండా ఉండేందుకు ధరలను దించక తప్పలేదు. అయితే ఇక జియో త్వరలో 4జీ వీవోఎల్‌టీఈ సౌకర్యంతో ఫీచర్ ఫోన్‌ను అందుబాటులోకి తేనుండడంతో ఫీచర్ ఫోన్లను తయారు చేస్తున్న కంపెనీలకు కూడా చెమటలు పట్టడం ఖాయంగా కనిపిస్తున్నది. చాలా రోజుల నుంచే జియో 4జీ ఫీచర్ ఫోన్ గురించిన వార్తలు వస్తున్నప్పటికీ ఆ ఫోన్ ఎప్పుడు విడుదల కానుంది, ధర ఎంత ఉంటుంది.. అన్న విషయాల్లో స్పష్టత లేదు. అయితే హెచ్‌ఎస్‌బీసీ సంస్థ అంచనా వేస్తున్న ప్రకారం జియో 4జీ ఫీచర్ ఫోన్ ఈ నెల 21వ తేదీన విడుదల కావచ్చని తెలిసింది.

ఈ నెల 21న ముంబైలో రిలయన్స్ ఇండస్ట్రీస్ వార్షిక సమావేశం జరగనుంది. అందులో భాగంగా చైర్మన్ ముఖేష్ అంబానీ జియో 4జీ ఫీచర్ ఫోన్‌ను విడుదల చేయనున్నట్టు తెలిసింది. ఇక ఈ ఫోన్‌ను ముందుగా అనుకున్నట్టు రూ.1500లకు కాక కేవలం రూ.500లకే అందిస్తుందని తెలుస్తున్నది.

ఇక ఏప్రిల్ నెలలో జియో సమ్మర్ సర్‌ప్రైజ్ ఆఫర్, ధన్ ధనా ధన్ ఆఫర్లను పొందిన వారికి గడువు ఈ నెలలో ముగుస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వారిని ఆకట్టుకునేందుకు జియో మరిన్ని కొత్త ప్లాన్లను అందుబాటులోకి తేనుందట. అయితే ఈ 4జీ ఫీచర్ ఫోన్‌తోపాటు, కొత్త ప్లాన్‌ల గురించి జియో ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక సమాచారం మాత్రం వెల్లడించలేదు.