Templates by BIGtheme NET
Home >> GADGETS >> రూ.399కే ఫోన్.. రూ.50తో రీచార్జ్.. Jio మళ్లీ మాయ చేయనుందా?

రూ.399కే ఫోన్.. రూ.50తో రీచార్జ్.. Jio మళ్లీ మాయ చేయనుందా?


భారత టెలికాం రంగ దిగ్గజం జియో తన జియో ఫోన్ ని మార్కెట్లోకి తెచ్చి కొన్ని సంవత్సరాలు అవుతుంది. దాని తర్వాత అప్ గ్రేడెడ్ వెర్షన్ గా జియో ఫోన్ 2 కూడా మార్కెట్లోకి వచ్చింది. అయినప్పటికీ అమ్మకాల పరంగా చూసుకుంటే ఇప్పటికీ మొదటి జియో ఫోనే ముందంజలో ఉంది. దానికి కారణం అందుబాటులో ఉన్న ధర. దీంతో తన మొదటి ఫోన్ కంటే చవకైన ఫోన్ ని తీసుకురావాలని జియో నిర్ణయించింది.

​చవకైన జియో ఫోన్!

91 మొబైల్స్ అందించిన సమాచారం ప్రకారం జియో ఫోన్ ప్రస్తుతం తన మొదటి ఫోన్ కంటే చవకైన జియో ఫోన్ లైట్ ను మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమయింది. జియో ఫోన్ ధరే ప్రస్తుతం అత్యంత తక్కువగా ఉంది. ఇప్పుడు దాని కంటే తక్కువగా కేవలం రూ.399కే జియో ఫోన్ లైట్ మార్కెట్లోకి రానుందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అంతే కాకుండా కేవలం రూ.50కే 28 రోజుల పాటు కాల్స్ చేసుకునేలా కొత్త ప్లాన్ ను కూడా రూపొందిస్తున్నట్లు సమాచారం. జియో నుంచి జియోకు ఉచిత కాల్స్ చేసుకోవచ్చు. ఇతర నెట్ వర్క్ లకు చేసుకునే కాల్స్ కు జియో చార్జీలు విధించే అవకాశం ఉంది.

​ఎప్పుడు లాంచ్ కానుంది?

అయితే ఈ ఫోన్ ఎప్పుడు లాంచ్ కానుందనే అంశంపై ఇంకా స్పష్టత లేదు. ఈ ఫోన్ పై జియో ఇంతవరకూ ఎటువంటి ప్రకటన కూడా చేయలేదు కాబట్టి దీని రాక మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ఈ సంవత్సరం జరగనున్న కంపెనీ వార్షిక సమావేశంలో ఇది లాంచ్ అయ్యే అవకాశం ఉందని పలువురు టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే జియో ఫోన్, జియో ఫోన్ 2 కూడా సంస్థ వార్షిక సమావేశాల్లోనే లాంచ్ అయ్యాయి.

​ఈ ఫోన్ లో ఏం ఉండే అవకాశం ఉంది?

మార్కెట్లో ఉన్న పుకార్లను బట్టి చూస్తే.. ఈ ఫోన్ లో జియో ఫోన్ కంటే చిన్నదైన డిస్ ప్లే, ఆల్ఫా న్యూమరిక్ కీప్యాడ్ ఉండే అవకాశం ఉంది. ఇందులో కెమెరా, ఎఫ్ఎం రేడియో వంటి ఫీచర్లు ఉంటాయో లేదో అనే సమాచారం ఇంతవరకు లేదు. అయితే దీని ధరను దృష్టిలో పెట్టుకుంటే.. ఈ ఫీచర్లు రావడం కూడా కష్టమే అని చెప్పాలి.

​ఇంటర్నెట్ పని చేయదా?

ఫోన్ లో ఎక్కువ ఫీచర్లు ఉండాలని కోరుకునే వారికి దీని ద్వారా నిరాశే ఎదురుకానుంది. ఎందుకంటే.. జియో ఫోన్ లైట్ లో ఇంటర్నెట్ కనెక్షన్ ఉండదని వార్తలు వినిపిస్తున్నాయి. కానీ కేవలం కాల్స్ మాత్రమే కావాలనుకునే వారికి ఈ ఫోన్ చాలా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే మొబైల్ రీచార్జ్ ప్లాన్ ధరలోనే ఫీచర్ మొబైల్ లభించనుంది. ఒకవేళ ఈ ఫోన్ లాంచ్ అయితే ఇంటర్నెట్ కనెక్టివిటీ లేకుండా జియో లాంచ్ చేసే మొదటి మొబైల్ ఇదే కానుంది. అయితే ఒకవేళ ఈ ఫోన్ లాంచ్ అయితే.. ఇంటర్నెట్ కనెక్టివిటీ కూడా లేని ఈ ఫోన్ ను వినియోగదారులు ఏ మేరకు ఆదరిస్తారో చూడాలి!