పవన్ ఫ్యాన్స్ కు రేణూ సీరియస్ వార్నింగ్

0అదే పనిగా దెబ్బలు తినటానికి రేణూ దేశాయ్ యంత్రం కాదు. ఎన్ని మాటలు అనేసినా పడి ఉండటానికి. నిజానికి పవన్ తో విడిపోయిన తర్వాత నుంచి ఆమెపైనా.. ఆమె నిర్ణయాల మీదా అదే పనిగా సలహాల రూపంలో నూ.. సందేశాల రూపంలోనూ.. హెచ్చరికలు చేస్తున్న ఫ్యాన్స్ కాస్త తగ్గితే మంచిది. ఎందుకంటే.. ఇంతకాలం సహనంతో భరించిన రేణూ స్వరంలో ఇప్పుడు తేడా వచ్చేసింది.

తన మాటలతో మంచిగా కన్వీన్స్ చేయటానికి తెగ ప్రయత్నించిన రేణూ స్వరంలో తేడా వచ్చేసింది. ఎంత చెప్పినా.. ఎంత ఆచితూచి మాట్లాడినా.. అదే పనిగా ట్రోల్ చేయటానికి ప్రయత్నిస్తున్న వారికి మంచి మాటలతో ప్రయోజనం లేదని భావిస్తున్నట్లుగా ఆమె తాజా మాటలు ఉన్నాయి. తనను అదే పనిగా ట్రోల్ చేస్తున్న వారిపై తొలిసారి ఘాటు హెచ్చరికలు చేశారు. పవన్ కల్యాణ్ తో విడాకుల వ్యవహారంపై తాను నోరు విప్పానంటే ఆయన అభిమానుల పొగరు మురికి కాలువలో పడి కొట్టుకుపోతుందని రేణూ సంచలన వ్యాఖ్య చేశారు.

పవన్ తో ఎందుకు విడిపోయారు? అంటూ రేణూను ప్రశ్నించిన ప్రతిసారి చాలా ఒద్దికగా సమాధానం ఇస్తూ.. అసలు నిజాన్ని కడుపులోనే ఉంచుకుంది తప్పించి.. తొందరపడి మాట మాట్లాడలేదు. కానీ..తాను చేసిన ప్రతి పనిని ఎత్తి చూపిస్తూ.. అనవసరంగా తనను వెంటాడుతున్న వారి తీరును తీవ్రంగా తప్పు పట్టింది. ఇన్నాళ్లు విడాకుల వ్యవహారంపై తాను మౌనంగా ఉన్నందుకు ఆయన అభిమానులు కృతజ్ఞులుగా ఉండాలనటం గమనార్హం.

తాను నోరు తెరిచి వాస్తవాల్ని కానీ బయటపెడితే.. మర్యాద తెలీని ఆయన అభిమానులకు గర్వభంగం కలుగుతుందన్నారు. తన ఇన్ స్టాగ్రాం ఖాతాలోకి వచ్చి ఏడుపుగొట్టు కథలు చెప్పే అధికారం పవన్ అభిమానులకు లేదంటూ రేణూ స్పష్టం చేశారు.

పవన్ కల్యాణ్ అభిమానుల నెగటివిటీని తాను భరించాల్సిన అవసరం ఏమిటని సూటిగా ప్రశ్నించారు. ఇంతకాలం ఫేస్ బుక్ లో రేణూ స్పందించిన తీరుకు (ఇప్పుడామె ఫేస్ బుక్ ఖాతాను క్లోజ్ చేశారనుకోండి) .. తాజాగా ఇన్ స్టాగ్రాం వేదికగా చేసుకొని ఇచ్చిన వార్నింగ్కు సంబంధం లేదని చెప్పాలి. పవన్ తో విడాకుల తర్వాత ఇన్నేళ్లలో ఒక్కసారిగా నోరు జారని రేణూ చేత పవన్ ను మాట అనిపించేలా పవన్ ఫ్యాన్స్ వ్యవహరించటం అర్థం లేనిది. పవన్ ఫ్యాన్స్ తీరు చూస్తుంటే.. ఆయన్ను అభిమానిస్తున్నారా? లేదంటే ఆయన్ను అవమానించటానికే ఫ్యాన్స్ రూపంలో ఉన్నారా? అన్న సందేహం కలగక మానదు. ఏమైనా.. రేణూ స్వరంలో తేడా వచ్చింది. అనవసర కెలుకుడు ఆపితే మంచిదన్న మాటను రేణూ చెప్పిన తీరుతోనైనా.. మార్పు వస్తుందా?