పెళ్లి చేసుకోబోతున్న రేణు దేశాయ్?

0Renu-Desaiపవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ మళ్లీ పెళ్లి చేసుకునే ఆలోచనలో ఉన్నారా..? అంటే అవుననే సమాధానాలే ఎక్కువ వినిపిస్తున్నాయి. మహిళా దినోత్సవం సందర్భంగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో రేణు దేశాయ్ కూడా ఈ విషయాన్ని పరోక్షంగా స్పష్టం చేశారు. తనను, పిల్లలను మంచిగా చూసుకునే వ్యక్తి వస్తే.. అతణ్ని తన జీవితంలోకి ఆహ్వానించేందుకు అభ్యంతరం లేదంటూ వెల్లడించారు. పవన్‌తో విడిపోయిన తర్వాత తీవ్ర మానసిక ఆందోళనకు గురయ్యానని.. ఆ సమయంలో మానసిక నిపుణులతో కౌన్సెలింగ్ తీసుకున్న తర్వాతే ఆలోచనలు అదుపులోకి వచ్చినట్లు వివరించారు.

‘గత ఏడాది వరకు నాకు పెళ్లి గురించి మరో ఆలోచన లేదు. కానీ ఇప్పుడిప్పుడే నేను వ్యక్తిగత జీవితం గురించి పునరాలోచించడం మొదలుపెట్టాను. ఎప్పుడైనా మానసిక ఆందోళనకు గురైనప్పుడు మళ్లీ పెళ్లి చేసుకుంటే తప్పేంటని అనిపిస్తుంటుంది. మా ఫ్రెండ్స్ కూడా అందంగా ఉండి ఒంటరిగా ఉన్న మహిళ నువ్వే అంటూ ఆట పట్టిస్తుంటారు. నన్ను, పిల్లలను మంచి చూసుకునే వ్యక్తి మళ్లీ నా జీవితంలో ఎదురైతే తప్పకుండా పెళ్లి గురించి ఆలోచిస్తా. ఏమో తలరాత ఎలా రాసిపెట్టుంటే అలా జరుగుతుందని ముందుకు వెళ్లిపోతా’ అని రేణు దేశాయ్ వివరించారు. ఒకవేళ అలాంటి వ్యక్తి దొరికి, పెళ్లి చేసుకోవాలనుకుంటే మాత్రం ప్రపంచానికి ముందు అతణ్ని పరిచయం చేసి తర్వాతే పెళ్లి చేసుకుంటానని రేణుదేశాయ్ స్పష్టం చేశారు.