పవన్ కొడుక్కి సినిమాలు ఇష్టం లేదట

0చిన్న స్థాయి హీరోల కొడుకులు కూడా నటన వైపే అడుగులేస్తున్నారు ఈ రోజుల్లో. కేవలం హీరోలని కాదు.. ఇండస్ట్రీలో వేర్వేరు విభాగాలకు చెందిన వాళ్లు తమ కొడుకుల్ని హీరోల్ని చేస్తున్నారు. అలాంటిది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొడుకు హీరో కాకుండా ఉంటాడా? అకీరా నందన్ కచ్చితంగా హీరో అవుతాడనే అంచనాతోనే ఉన్నారు అభిమానులు. ఆ మధ్య పవన్ తో కలిసి ఒక ఎయిర్ పోర్టులో నడిచి వస్తున్న అకీరాను చూసి అందరూ షాకయ్యారు. ఇంకా స్కూల్ స్థాయిలో ఉండగానే పవన్ కంటే ఎత్తుకు పెరిగిపోయాడు అకీరా. దీంతో టాలీవుడ్ కు మరో మాచో హీరో దొరికేశాడంటూ పవన్ అభిమానులు సోషల్ మీడియాలో హడావుడి చేయడం మొదలుపెట్టారు. కానీ అకీరాకు మాత్రం నిజానికి సినిమాల పట్ల ఆసక్తి లేదని అంటోంది అతడి తల్లి రేణు దేశాయ్.

తాను ఇప్పటికే తన కొడుకు కెరీర్ గురించి ఆలోచిస్తున్నానని.. అతడితో ఆ విషయం డిస్కస్ చేస్తున్నానని.. కానీ కెరీర్ ప్లాన్స్ ఏంటి అన్న ప్రతిసారీ తనకైతే సినిమాల పట్ల ఏ ఆసక్తి లేదని అకీరా తేల్చి చెబుతున్నాడని రేణు చెప్పింది. ఇన్స్టాగ్రామ్లో అభిమానులతో చిట్ చాట్ సందర్భంగా రేణు ఈ విషయం వెల్లడించింది. ప్రస్తుతం అకీరా తొమ్మిదో తరగతే చదువుతున్నాడని.. కొన్నేళ్ల తర్వాత కెరీర్ విషయంలో నిర్ణయం తీసుకుంటాడని ఆమె చెప్పింది. పెళ్లి తర్వాత కూడా అకీరా మీతోనే ఉంటాడా అని ఒక అభిమాని అడిగితే.. పెళ్లవుతోంది తనకే కానీ.. అకీరాకు కాదని.. కాబట్టి అతను మున్ముందు కూడా తనతోనే ఉంటాడని రేణు స్పష్టం చేసింది. పవన్తో సంబంధాల గురించి అడిగితే.. అతను తన ఇద్దరు పిల్లలకు తండ్రి కాబట్టి ఇకపైనా సంబంధాలు కొనసాగుతాయని.. తామిద్దరం వాళ్ల కెరీర్ల గురించి మాట్లాడతామని.. హాలీడేస్ వచ్చినపుడు పిల్లలు తండ్రి దగ్గరికి వెళ్తారని రేణు చెప్పింది.