జనసేన పార్టీ కార్యాలయంలో గణతంత్ర వేడుకలు

0republic-day-celebrations-aహైదరాబాద్‌: వ్యక్తి, పార్టీల కంటే దేశం, సమాజం ఎంతో ముఖ్యమని జనసేన అధినేత, ప్రముఖ సినీనటుడు పవన్‌ కల్యాణ్‌ అన్నారు. శుక్రవారం ఉదయం జనసేన పార్టీ కార్యాలయంలో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయన జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. స్వాతంత్ర్య సముపార్జన కోసం మహానుభావులెందరో త్యాగాలు చేశారని కొనియాడారు. అలాంటి త్యాగధనుల స్ఫూర్తితోనే రాజకీయాల్లోకి వచ్చానని పవన్‌ ఈ సందర్భంగా అన్నారు. విడిపోవాలనుకునేందుకు మనుషులకు ఎన్నో కారణాలు ఉంటాయని, జాతి సమైక్యంగా ఉండాలన్న స్ఫూర్తి గణతంత్ర దినోత్సవం గుర్తు చేస్తుందని పవన్‌ అన్నారు.

సావిత్రి, ఎస్వీఆర్‌కు పద్మ పురస్కారాలు ఇవ్వాలి

పద్మ అవార్డులకు ఎంపికైన వారికి జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ శుభాకాంక్షలు చెప్పారు. పద్మ విభూషణ్‌కు ఎంపికైన ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా, పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన తెలుగుతేజం, బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు శ్రీకాంత్‌ కిదాంబికి శుభాభినందనలు తెలిపారు. మరింతమంది తెలుగు వారికి అవార్డులు వచ్చి ఉంటే బాగుండేదని పవన్‌ అభిప్రాయపడ్డారు. సినీరంగంలో అలనాటి సహజనటి సావిత్రి, ఎస్వీ రంగారావుకు పద్మ అవార్డులను ప్రకటించాలని కోరారు. ఇందుకోసం కేంద్రం, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాలు చొరవతీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

రేపటి నుంచి చలోరే.. చలోరె.. చల్‌

ఈ నెల 27 నుంచి 29 వరకు అనంతపురం జిల్లాలో పవన్‌ పర్యటనకు షెడ్యూల్‌ ఖరారైంది. చలోరె.. చలోరె.. చల్‌ కార్యక్రమంలో భాగంగా అనంతపురం జిల్లాలో కరవుపై అధ్యయనం, అవగాహన కోసం వివిధ ప్రాంతాల్లో పవన్‌ పర్యటించనున్నట్టు ఆ పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. శనివారం ఉదయం అనంతపురం చేరుకోనున్న పవన్‌ అనంతపురంలో ఆ పార్టీ జిల్లా కార్యాలయానికి శంకుస్థాపన చేస్తారు. మధ్యాహ్నం జనసేన ప్రజా వేదికలో ‘సీమ కరవుకు పరిష్కార మార్గాలు’ అనే అంశంపై కేటీఆర్‌ ఫంక్షన్‌ హాలులో రైతులు, వ్యవసాయ, నీటిపారుదల రంగాల నిపుణులతో నిర్వహించే చర్చాగోష్ఠిలో పాల్గొంటారు. దీనికి కేవలం ఆహ్వానితులను మాత్రమే అనుమతిస్తారు. అనంతరం స్థానిక పార్టీ ముఖ్యులు, కార్యకర్తలతో పవన్‌ మాట్లాడతారు.

ఈ నెల 28న ఉదయం కదిరి చేరుకొని నరసింహస్వామిని దర్శించుకుంటారు. కరవు పరిస్థితులపై అక్కడి ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అక్కడినుంచి పుట్టపర్తికి పయనమవుతారు. సాయంత్రం పుట్టపర్తి చేరుకొని సత్యసాయి మందిరం, మంచినీటి పథకం, ఆస్పత్రిని సందర్శిస్తారు. రాత్రి అక్కడే బసచేసి 29న ఉదయం పుట్టపర్తి నుంచి ధర్మవరం పయనమవుతారు.అక్కడి చేనేత కార్మికులతో సమావేశమవుతారు. అనంతరం హిందూపురం వెళ్లి అక్కడి జనసేన కార్యకర్తల సమావేశంలో మాట్లాడతారు. ఈ సమావేశానికి జిల్లా వ్యాప్తంగా ఉన్న జనసేన కార్యకర్తలు హాజరు కానున్నారు.