అమలను టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి…!

0Amala-and-Revanth-reddyరాష్ట్రంలోని ప్రజల సమస్యలను ప్రస్తావిస్తూ తెలంగాణ ప్రభుత్వంపై ఇప్పటికే తీవ్రస్థాయిలో విమర్శలు ఎక్కుపెడుతున్న తెలంగాణ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి.. ఇప్పుడు ప్రముఖ సినీ హీరో నాగార్జున సతీమణి, పెటా(జంతు సంక్షేమ) కార్యకర్తల అమలను టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. ఇందుకు ఓ కారణం కూడా ఉంది.

అదేమంటే.. అమలకు జూబ్లీహిల్స్‌లో అత్యంత ఖరీదైన ప్రాంతంలో పిచ్చికుక్కలను పెంచుకునేందుకు మూడు ఎకరాల స్థలం కేటాయించడమే. ఈ చర్యను రేవంత్ రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. హైదరాబాద్‌లో ఆంధ్రా కుక్కలకు ఉన్న విలువ కూడా తెలంగాణ బిడ్డలకు లేదా అని రేవంత్ రెడ్డి ..కేసీఆర్ ప్రభుత్వాన్ని నిలదీశారు.

ఆంధ్రా వ్యక్తులైతేనే తమకు బాగా కమీషన్ ఇస్తారని, అందుకే వారికి కీలక పదవులు కట్టబెడుతున్నారంటూ ధ్వజమెత్తారు. ఆంధ్రా వ్యక్తులకు తెలంగాణ సర్కారు పెద్దపీట వేస్తోందని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం వస్తే.. లక్షల ఉద్యోగాలు వస్తాయని విద్యార్థులకు, యువతకు ఆశలు కల్పించిన కేసీఆర్.. ఇప్పుడు ఆంధ్రావారికి ప్రాధాన్యం ఇస్తూ తెలంగాణ వాళ్లను అణగదొక్కేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన పలు ఉదాహరణలను ఆయన చెప్పారు.

హైదరాబాద్ మెట్రో రైల్ సీఎండీగా ఆంధ్రాకు చెందిన ఎన్వీఎస్ రెడ్డిని మరో ఐదేళ్లపాటు కొనసాగించడం, ఐఐటీఆర్‌కు ఏపీలోని కృష్ణా జిల్లాకు చెందిన లండన్ శ్రీనివాస్ అనే వ్యక్తిని సీఈఓగా నియమించడాన్ని రేవంత్ రెడ్డి తప్పుబట్టారు. సీఈఓ పదవికి తెలంగాణలో టాలెంట్ ఉన్న వ్యక్తులే కరువయ్యారా? అంటూ రేవంత్ ధ్వజమెత్తారు. ఓ వైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగానే.. ఇక్కడ ఆంధ్రా వ్యక్తులపై రేవంత్ విమర్శలు చేయడం చర్చనీయాంశంగా మారింది.

కేసీఆర్ సర్కారును విమర్శించడంలో రేవంత్ పక్కదారి పడుతున్నారా? అంటూ పలువురు విశ్లేషిస్తున్నారు. గతంలో కూడా సినీనటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెషన్ అక్రమంగా ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుందని రేవంత్ ఆరోపించారు. అంతేగాక, దీనిపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. మంత్రి కేటీఆర్, నాగార్జునల మధ్య ఒప్పందమేదైనా కుదిరిందా? అంటూ ప్రశ్నించారు.