పవన్‌కల్యాణ్‌ నిద్రపోతున్న ఓ అగ్నిపర్వతం

0ram-gopal-varma-pawan-kalyanరామానుజానికీ అర్థం కాని లెక్క… రాంగోపాల్‌ వర్మ! ఐన్‌స్టీన్‌నీ కన్‌ఫ్యూజ్‌ చేసే ఫార్ములా ఆర్జీవీ. అతని మాటలే సూపర్‌ హిట్‌ సినిమా చూస్తున్నంత థ్రిల్లింగ్‌గా ఉంటాయి. వర్మలా మాట్లాడడం, ఆలోచించడం, జీవించడం ఓ గొప్ప ఆర్ట్‌ అని ఆయన అభిమానులు నమ్ముతుంటారు. దానికి తగ్గట్టుగానే వర్మ చేష్టలుంటాయి. ట్వీట్‌ చేసినంత ఈజీగా సినిమాలు తీస్తుంటారు. సినిమాల్లోనూ ఇవ్వనంత కిక్‌ ట్విట్టర్‌ ద్వారా పంచుతుంటారు. ఇప్పుడు వర్మ నుంచి మరో సినిమా వస్తోంది. అదే ‘వంగవీటి’. శుక్రవారం ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా రాంగోపాల్‌ వర్మ చెప్పిన కబుర్లు ఇవీ…

‘వంగవీటి’ కథ, విజయవాడ రాజకీయాలు ఇవన్నీ మీకు ముందే తెలుసు. అయితే ఇంత ఆలస్యంగా సినిమాగా తీయడానికి కారణమేంటి?
ఆ కథని సినిమాగా తీయడానికి కావల్సిన పరిపక్వత ఇప్పుడే వచ్చిందనుకొంటా. ‘వంగవీటి’ సినిమా నేను ఇప్పుడు తీసుండొచ్చు. కానీ ఆ ప్రభావం నాకు ‘శివ’లోనూ కనిపించింది.

రెండు వర్గాలకు సంబంధించిన కథ ఇది. ఒకరిని హీరోగా, మరొకరిని విలన్‌గా చూపిస్తే విజయవాడలో మరోసారి అశాంతి నెలకొనే ప్రమాదం ఉంది కదా?
‘ఏ’ అనేవాడ్ని హీరోగా చూపించి ‘బి’ని విలన్‌గా చేశాననుకోండి. ‘బి’ అభిమానులు నాపై కోపం పెంచుకోవాలి. ‘ఏ’పై కాదు. అయినా నేను ఆ ప్రమాదం రానివ్వలేదు.

ఈ సినిమాలో ఎన్టీఆర్‌కి సంబంధించిన పాత్ర ఉంటుందా? ఆయన పాత్రని ఎలా తీర్చిదిద్దారు?
ఎన్టీఆర్‌ పాత్ర ఉంది. కానీ ఎలా ఉంటుందన్నది టికెట్‌ కొని చూసి తెలుసుకోండి.

వంగవీటి రంగ, రాధ, మురళి వీళ్లని ఎప్పుడైనా కలిసి మాట్లాడారా?
కలుసుకొని మాట్లాడింది లేదు. చూశానంతే! వాళ్లకు సంబంధించిన చాలామంది వ్యక్తుల్ని కలిశా. వాళ్లు చెప్పిన విషయాల్లో నమ్మశక్యంగా ఉన్న వాటినే తీసుకొన్నా. విజయవాడలో ఏం జరిగిందో అందరికీ తెలుసు. దాన్ని నా కోణంలో చూపిస్తున్నానంతే. ఓ దర్శకుడిగా నాకా స్వేచ్ఛ ఉంది.

చదువుకునే రోజుల్లో విద్యార్థి రాజకీయాలూ, గొడవల్లో పాల్గొనేవారా?
నేనూ ఓ చిన్న సైజు రౌడీనే. ఏదేదో చేసేయగలనని కేవలం మాటల ద్వారా నమ్మించేవాడ్ని అంతే.

‘వంగవీటి’ మీ చివరి తెలుగు చిత్రం అని చెప్పడానికి కారణం ఏమిటి?
ఇంత కంటే గొప్ప కథ నాకు దొరకదన్న భయంతో. ‘న్యూక్లియర్‌’ అనే ఓ సినిమా తీస్తున్నా. దానికి మూడేళ్ల సమయం పడుతుంది.

ఇకనుంచి గర్వపడే మంచి సినిమాల్నే తీస్తా… కావాలంటే ఒట్టు అన్నారు…
నేను ఒట్లమీద నిలబడనని మీ అందరికీ తెలుసు కదా? (నవ్వుతూ). కానీ ‘వంగవీటి’ మాత్రం నా చివరి సినిమానే. దాన్ని మాత్రం సీరియస్‌గా తీసుకోండి.

నాగార్జున ‘శివ 2’ చేయమంటున్నారు…
‘శివ’కు సీక్వెల్‌ చేసే ఆలోచన లేదు. ఎందుకంటే ‘శివ’ సమయంలో ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవు. అంతగా కావాలంటే నాగార్జునతో యాక్షన్‌ సినిమా చేస్తా.

చిరంజీవి 150వ సినిమా గురించి మీరు రకరకాల ట్వీట్లు చేస్తున్నారు. సంక్రాంతి వార్‌ వన్‌సైడ్‌ అంటున్నారు…
చిరంజీవి అంటే నాకు అభిమానం. ఓ అభిమానిగా ఆయన ‘బాహుబలి’ కంటే పెద్ద సినిమా తీయాలనుకోవడం తప్పు కాదు కదా? ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ కోసం క్రిష్‌ పెడుతున్న ఎఫర్ట్‌ నచ్చింది. అందుకే అలా అన్నా.

పవన్‌ కల్యాణ్‌ మీదా మీ ట్వీట్ల ప్రవాహం సాగుతోంది?
పవన్‌కి నేను వీరాభిమానిని. అయితే… పవనిజం అనే కాన్సెప్ట్‌ నాకు అర్థం కాలేదు. రామూఇజం గురించి నేను నలభై గంటలు మాట్లాడతా. పవనిజం గురించి ఆయన నాలుగు నిమిషాలైనా మాట్లాడగలరా? నాకు తెలిసి పవన్‌ నిద్రపోతున్న ఓ అగ్విపర్వతం. అప్పుడప్పుడూ అగ్నిపర్వతం బుసబుసమంటూ పొగలు కక్కుతుంటుంది. కానీ ఏదో ఓ రోజు అగ్నిపర్వతం బద్దలవ్వడం ఖాయం.

మీరూ రాజకీయాల్లో చేరొచ్చు కదా?
నాకు ప్రజాసేవపై నమ్మకం, ఇష్టం రెండూ లేవు.

ఈమధ్య ఎక్కువగా పాటలు పాడుతున్నారు…
నా నోటికి ఎవరైనా ప్లాస్టర్‌ వేసేంత వరకూ పాడుతూనే ఉంటాను.

‘నయీం’, ‘శశికళ’ ఇలా చాలా సినిమాలు ప్రకటించుకొంటూ వెళ్తున్నారు. అవన్నీ ఎప్పుడు తీస్తారు?
నా ఇష్టం వచ్చినప్పుడు.