మహేష్ ద్రోహి అంటున్న వర్మ

0RGV-Tweets-On-Maheshరామ్ గోపాల్ వర్మ ఎప్పుడు ఎవరిని టార్గెట్ చేస్తాడో తెలియదు. ఇప్పుడు ఆయన కొత్త టార్గెట్ సూపర్ స్టార్ మహేష్ అయ్యాడు. జల్లికట్టుపై నిషేధం విధించడాన్ని వ్యతిరేకిస్తూ చేసిన ట్వీట్ల విషయంలో ఆల్రెడీ విమర్శలు ఎదుర్కొంటున్న మహేష్ బాబును.. వర్మ ప్రత్యేక హోదా అంశంతో ముడిపెట్టి మరింతగా ఇరికించేశాడు. తన రాబోయే సినిమా తమిళంలోనూ విడుదలవుతున్న నేపథ్యంలో తమిళ ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడానికే మహేష్ జల్లికట్టు వివాదంపై స్పందించాడని ఇప్పటికే విమర్శలు ఎదుర్కొన్నాడు. ఆ విషయాన్ని నొక్కి చెబుతూ.. వర్మ మహేష్ మీద ట్వీట్లు గుప్పించాడు.

తమిళ జనాల విషయంలో మహేష్ బాబుకు ఉన్న కన్సర్న్.. తెలుగు జనాల సమస్యలపై లేదని.. ప్రత్యేక హోదాపై పవన్ కళ్యాణ్ అంతగా పోరాడుతుంటే మహేష్ సైలెంటుగా ఉండటం ఏం న్యాయమని ప్రశ్నించాడు వర్మ. మహేష్ సొంత రాష్ట్రాన్ని పెద్ద ద్రోహమే చేస్తున్నాడన్నట్లు మాట్లాడాడు వర్మ. పవన్ కళ్యాణ్‌‌కు మద్దతు పలకని ఏ సెలబ్రెటీ అయినా ద్రోహేనని తీర్మానించాడు వర్మ. సినిమా హీరోలు మామూలుగా సినిమాల్లోనే పోరాడతారని.. పవన్ మాత్రం రియల్ ఫైటర్ అని.. పవన్ జనాల కోసం రోడ్డు మీదికి వస్తుంటే మహేష్ మాత్రం బెడ్రూంలో ఆలోచిస్తూ కూర్చుంటున్నాడని వర్మ వ్యాఖ్యానించాడు. పవన్ లాగా మహేష్‌కు జనాల పట్ల బాధ్యత లేదని అన్నాడు.

మహేష్ రాజకీయ అంవాలపై మాట్లాడనట్లయితే జల్లికట్టు మీద మాత్రం ఎందుకు స్పందించాడని వర్మ ప్రశ్నించాడు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో పాటు మహేష్ కూడా ఏపీకి రియల్ విలన్స్ అని కూడా వర్మ తీర్మానించాడు. మహేష్ అభిమానులు పవన్ లాగా పోరాడకుంటే వాళ్లు కూడా పెద్ద ద్రోహులుగా మిగిలిపోతారని వర్మ అభిప్రాయపడ్డాడు.