మోసాలు… బాధలు… కన్నీళ్లు! శ్రీదేవి జీవితంపై రామ్‌గోపాల్‌ వర్మ కోణం

0శ్రీదేవి అంటే ఓ అందాల తార. దివి నుంచి భువికి దిగొచ్చిన ఓ దేవకన్య. అయితే ఇదంతా నాణేనికి ఒకవైపే. మరోవైపు చూస్తే అతిలోక సుందరి జీవితంలో ఎన్నో ఆటుపోట్లు. అవన్నీ కూడా ఊహకందని ఓ అగాథాన్ని… ఓ కల్లోలాన్ని గుర్తు చేస్తాయి. అపురూపమైన ఆ సౌందర్యం వెనక శ్రీదేవి ఇంత వేదనని దాచుకొందా అనిపిస్తుంది. శ్రీదేవి అందాన్ని ఆరాధిస్తూ, ఆమెని కలవడం కోసమే దర్శకుడినయ్యానని చెప్పే ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ.. శ్రీదేవి అభిమానుల కోసం ఓ ప్రేమలేఖ రాశాడు. అందులో శ్రీదేవి జీవితాన్ని తన కోణంలో  ఆవిష్కరించాడు. ఆ విషయాలు చిత్రసీమలో చర్చనీయాంశంగా మారాయి. ‘‘కొద్దిమంది పేర్లున్నాయి కాబట్టి ఇది బయట పెట్టడం సమంజసమేనా అని నాలో నేనే చర్చించుకొన్నా. కానీ శ్రీదేవి అభిమానులకి సంబంధించిన వారు కాబట్టి, అందరికంటే కూడా వాళ్లు నిజం తెలుసుకోవడానికి ఎక్కువ అర్హులు అనిపించింద’’ంటూ ఆయన తన లేఖని ట్విట్టర్‌ ద్వారా బయట పెట్టారు. అందులో ఉన్న కొన్ని విషయాలివీ…

* ‘‘శ్రీదేవి తన చుట్టూ మానసిక పరమైన ఒక గోడని నిర్మించుకొంది. తన జీవితంలో ఏం జరుగుతోందో, తన అభద్రతాభావాలేమిటో ఎవరికైనా తెలుస్తాయేమో అని భయపడింది. అది ఆమె తప్పు కాదు. చిన్న వయసులోనే ఆమెకొచ్చిన కీర్తి అలాంటిది. అది స్వతంత్రంగా, తాను కోరుకొన్నట్టుగా ఉండే అవకాశం ఇవ్వలేదు. తన స్వీయ జీవితాన్ని దాచడానికి మానసిక పరమైన మేకప్‌ వేసుకోవల్సి వచ్చింది’’.

* ‘‘లక్షలాదిమంది అభిమానుల్లాగే నేను కూడా శ్రీదేవి  అందమైన, ఆకర్షణీయమైన మహిళ అని నమ్ముతా. దేశంలోని అతి పెద్ద సూపర్‌స్టార్‌గా 20 యేళ్లపాటు వెండితెరని శాసించింది. అయితే అదంతా ఓ భాగం మాత్రమే. శ్రీదేవి     మరణంపై ఎంతగా దిగ్భ్రాంతికి గురయ్యానో… ఇప్పుడు మరొకసారి ఆమె జీవితం, మరణం వెనకున్న ఊహకందని, దారుణమైన, సున్నితమైన, అర్థం కాని పలు విషయాలు నా మదిలో మెదులుతున్నాయి’’.

* ‘‘శ్రీదేవి మరణించాక ఆమె అందం గురించి, నటన గురించి, మృతి గురించి అందరూ చెప్పుకొంటున్న దానికంటే నేను మరిన్ని విషయాలు చెప్పడానికి ఆస్కారముంది.   ఎందుకంటే ఆమెతో ‘క్షణక్షణం’, ‘గోవిందా గోవిందా’ చిత్రాల్ని తీసి సన్నిహితంగా మెలిగే అవకాశం నాకు లభించింది. ఒక తార జీవితాన్ని ప్రపంచం మొత్తం చూసే కోణానికి, వాస్తవానికీ ఎంత వ్యత్యాసం ఉంటుందనేదానికి శ్రీదేవి జీవితం ఓ గొప్ప  ఉదాహరణ’’.

* ‘‘చాలామందికి శ్రీదేవి జీవితం పరిపూర్ణమైనదిగా కనిపిస్తుంది. అందమైన ముఖారవిందం, గొప్ప ప్రతిభ, ఇద్దరు  అందమైన కూతుళ్లతో… చూడ్డానికి ఒక స్థిరమైన కుటుంబం. వెలుపలి నుంచి చూస్తే చాలా ఆకర్షణీయంగా, అందరూ   కోరుకొనేలాగా ఉంటుంది ఆ జీవితం. మరి శ్రీదేవి తన   జీవితాన్ని సంతోషంగానే గడిపిందా? ఆమె సంతృప్తిగానే ఉండేదా? నేను ఆమెని కలిసినప్పట్నుంచి ఆమె జీవితం నాకు తెలుసు. నా కళ్లతో చూశాను…  శ్రీదేవి తండ్రి మరణించేంత వరకు ఆమె జీవితం ఆకాశంలో స్వేచ్ఛగా ఎగిరే పక్షిలా    గడిచింది. ఆ తర్వాత ఆమె తల్లి అతి సంరక్షణతో పంజరంలో చిక్కుకున్న పక్షిలా మారిపోయింది’’.

* ‘‘ఆ రోజుల్లో పారితోషికంగా నటులకి నల్లధనం ఎక్కువగా ఇచ్చేవాళ్లు. దాంతో పన్నుల గురించి దాడులు చేస్తారేమో అనే భయంతో శ్రీదేవి తండ్రి తన  స్నేహితుల్ని, బంధువుల్ని నమ్మి వాళ్లకి ఇవ్వగా..ఆయన చనిపోయేసరికి వాళ్లంతా కూడా మోసం చేశారు. దాంతో అమాయకురాలైన తల్లితో కలిసి శ్రీదేవి వివాదాల్లో ఉన్న స్థిరాస్తులపై పెట్టుబడులు పెట్టడంతో పాటు, ఇతరత్రా పొరపాట్లు చేసింది. దాంతో బోనీ కపూర్‌ తన జీవితంలోకి వచ్చేసరికి శ్రీదేవి చేతిలో చిల్లిగవ్వ లేని పరిస్థితి. అతను కూడా అప్పటికి అప్పుల్లో కూరుకుపోయి ఉన్నాడు’’.

* ‘‘అదే సమయంలో అమెరికాలో జరిగిన తప్పుడు శస్త్రచికిత్స వల్ల శ్రీదేవి తల్లి  మానసిక రోగి అయ్యింది. అలాగే చెల్లెలు శ్రీలత పొరుగింటికి చెందిన అబ్బాయితో కలిసి పారిపోయి వివాహం చేసుకొంది. తల్లి చనిపోయే ముందు ఆస్తులన్నింటినీ శ్రీదేవి పేరుమీదే పెట్టింది కానీ, ఆ తర్వాత ఆమె సోదరి ‘తన తల్లి మానసిక స్థితి సరిగా లేదని, అందుకే అలా విల్లు రాసింద’ని కేసు వేసింది. దాంతో ప్రపంచంలోని లక్షలాది మంది కోరుకొన్న మహిళ ఒంటరిగా, బోనీ కపూర్‌ తప్ప చేతిలో చిల్లిగవ్వ లేకుండా నిలుచుంది’’.

* ‘‘తన కుటుంబాన్ని చీల్చడానికి వచ్చిన వ్యక్తిగా భావిస్తూ బోనీకపూర్‌ తల్లి ఒక ఫైవ్‌స్టార్‌ హోటల్‌ లాబీలో అందరూ చూస్తుండగానే శ్రీదేవి కడుపుపై గుద్దింది. అదంతా ఆమె బోనీకపూర్‌ తొలి భార్య మోనా కోసమే చేసింది’’.

* ‘‘ఈ మొత్తం కాలంలో ‘ఇంగ్లిష్‌ వింగ్లిష్‌’ సినిమా చేస్తున్న సమయంలో కొంత కాలాన్ని మినహాయిస్తే మిగతా అంతా కూడా దుఃఖంతోనే గడిపిన ఓ మహిళ శ్రీదేవి. ఆమె వ్యక్తిగత జీవితం… వికారమైన మలుపులు, అనిశ్చితి, ఊహకందని భవిష్యత్తుతో గడిచింది. ఆ జీవితం ఒక సూపర్‌స్టార్‌ సున్నితమైన మనసుపై లోతైన మచ్చల్ని వేయడంతో పాటు, ప్రశాంతతని దూరం చేసింది’’.

* ‘‘చాలామందికి శ్రీదేవి ఒక అందమైన మహిళ. మరి ఆమె తనని తాను అందంగా ఉన్నాననుకొందా అంటే     అనుకుంది. అయితే నటీమణులందరికీ వయసు ఓ పీడకల. అది శ్రీదేవికి కూడా మినహాయింపు కాదు. దాంతో కొన్నేళ్లుగా ఆమె సౌందర్య శస్త్రచికిత్సల్ని ఆశ్రయిస్తూ వచ్చింది. ఆ ప్రభావం ఆమెపై స్పష్టంగా కనిపించేది’’.

* ‘‘తల్లిదండ్రులు, బంధువులు, భర్తతో పాటు పిల్లలకి సంబంధించిన ఉద్దేశాలన్నీ కూడా శ్రీదేవి జీవితాన్ని ప్రభావితం చేశాయి. ఇతర తారల పిల్లల్లాగే తన పిల్లలకి కూడా ఆదరణ దక్కుతుందో లేదో అని భయపడింది శ్రీదేవి. నిజానికి ఆమె ఒక మహిళ శరీరంలో చిక్కుకున్న చిన్నారి అని చెప్పొచ్చు’’.

* ‘‘ఆమెతో ఉన్న నా వ్యక్తిగత అనుభవం కొద్దీ చెబుతున్నా. కెమెరా ముందు యాక్షన్‌, కట్‌కి మధ్య మాత్రమే ఆమెని ప్రశాంతంగా చూశాను. ఆ సమయంలోనే ఆమె కఠినమైన తన  వాస్తవ జీవితం నుంచి బయటికొచ్చి సొంత కాల్పనిక ప్రపంచంలోకి వెళ్లిపోయేది’’. courtesy : eenadu