హీరోయిన్ అశ్లీల వీడియో కేసు, దర్శకుడికి బెయిల్

0బెంగుళూరు : తన ముఖంతో కూడిన ఫేక్ అశ్లీల వీడియో సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో, యూట్యూబ్‌లో దర్శనం ఇవ్వడంపై కన్నడ నటి రిషికా సింగ్ ఆ మధ్య పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ పని చేసింది దర్శకుడు ఎస్.కె బషీద్ అని, అతనే ఆ వీడియోను మార్ఫింగ్ చేసి ఇంటర్నెట్లో స్ర్పెడ్ అయ్యేలా చేసాడని తన ఫిర్యాదులో పేర్కొంది.

మే 2న రిషికా సింగ్ బెంగుళూరులోని సంజయ్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసుకు సంబంధించి దర్శకుడు ఎస్‌కె బషీద్ బుధవారం(మే 15)న బెంగుళూరులోని కోర్టులో లొంగి పోయారు. బషీద్ అభ్యర్థన మేరకు కోర్టు అతనికి షరతులతో కూడిన బెయిల్ గురువారం మంజూరు చేసింది.

బెయిల్ కండీషన్ల ప్రకారం…దర్శకుడు బషీద్ ప్రతిరోజు పోలీస్ స్టేషన్‌కు వచ్చి సంతకం పెట్టాల్సి ఉంటుంది. అదే విధంగా రూ. లక్ష పూచికత్తు, విచారణకు పూర్తిగా సహకరించాలి. ఎలాంటి పలుకుబడి ఉపయోగించి సాక్ష్యాలను తారుమారు చేయడం లాంటి పనులు చేయకూడదనే షరతులతో బెయిల్ మంజూరైంది.

రిషిక ప్రముఖ దర్శకుడు ఎస్.వి. రాజేంద్రసింగ్ కూతురు, కన్నడ సినీ ప్రముఖుడు ఆదిత్యకు సోదరి. ఇటీవల ‘బెంకి బిరుగాలి’ అనే కన్నడ చిత్రం విడుదలైంది. ఈ చిత్రంలో రిషిక కూడా నటించింది. ఈ చిత్రానికి దర్శకత్వం వహించడంతో పాటు అందులో ముఖ్య పాత్రలో నటించాడు ఎస్.కె. బషీద్. ప్రేక్షకులను థియేటర్లకు ఆకర్షించడానికే ఆయన ఈ పని చేసాడని రిషిక ఆరోపించింది.