బీజేపీ అభ్యర్థిగా నటి గౌతమి?

0gauthami-picఉత్తరాది ఎన్నికల ప్రభంజనంతో ఉత్సాహంగా ఉన్న బీజేపీ దక్షిణాది వైపు చూస్తుండగా, ఆర్కేనగర్‌ ఉపఎన్నికల్లో నటి గౌతమిని అభ్యర్థిగా దింపేందుకు సిద్ధం అవుతున్నట్లు సమాచారం. అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణంతో ఆర్కేనగర్‌ అసెంబ్లీ నియోజకవర్గం ఖాళీకాగా, ఈ స్థానాన్ని భర్తీ చేసేందుకు వచ్చేనెల 12వ తేదీన ఎన్నికల పోలింగ్‌ జరగనుంది. ఈనెల 16వ తేదీ నుంచి నామినేషన్లు ప్రారంభం అవుతుండగా మంగళవారం వరకు ఏ ఒక్క పార్టీ తన అభ్యర్థిని ఖరారు చేయలేదు.

అధికార అన్నాడీఎంకేలోని రెండు వర్గాలు, డీఎంకే సహా అన్ని పార్టీలు అభ్యర్థి ఎంపికలో తలమునకలై ఉన్నాయి. జయ మరణంతో అన్నాడీఎంకేలో నాయకత్వ సమస్య, రెండుగా చీలిపోవడం తదితర సమస్యలు డీఎంకేకు అనుకూలిస్తాయని అంటున్నారు. దీంతో అభ్యర్థి ఎంపికలో డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్‌ మరింత శ్రద్ధచూపుతున్నారు. పార్టీ అధ్యక్షులు కరుణానిధి సలహాసైతం తీసుకుంటున్నట్లు సమాచారం.

ఎన్నికల ప్రకటన వెలువడిన నాడే ఆశావహుల నుంచి దరఖాస్తుల స్వీకరణను డీఎంకే ప్రారంభించింది. దరఖాస్తు దారులను స్టాలిన్‌ శరవేగంగా ఇంటర్వూ్యలు చేస్తున్నారు. పార్టీ కార్యాలయంలో మంగళవారం సమావేశం ముగిసిన అనంతరం డీఎంకే అభ్యర్థి పేరును స్టాలిన్‌ ప్రకటిస్తారనే ప్రచారం జరిగినా చివరకు వాయిదా పడింది. అయితే మరికొందరితో సమావేశం కావాల్సి ఉన్నందున అభ్యర్థిని బుధవారం ఖరార చేస్తామని సమావేశం ముగిసిన తరువాత మీడియా వద్ద స్టాలిన్‌ ప్రకటించారు. అధికార అన్నాడీఎంకే నుంచి ఆ పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్, తిరుగుబాటు పన్నీర్‌సెల్వం వర్గం నుంచి మధుసూదనన్‌ పేర్లు దాదాపు ఖరారయ్యాయి. అయితే ఎవ్వరూ అధికారికంగా ప్రకటించలేదు.

అన్నాడీఎంకేలో రెండు వర్గాలు అభ్యర్థిని ఖరారు చేయడం కంటే రెండాకుల చిహ్నం దక్కించుకోవడంపైనే ప్రధానంగా దృష్టి సారించాయి. ప్రధాన కార్యదర్శిగా శశికళ ఎంపికపై ప్రధాన ఎన్నికల కమిషన్‌ తన నిర్ణయాన్ని రెండురోజుల్లో ప్రకటిస్తుందని ఇరువర్గాలు ఆశిస్తున్నాయి. సీఈసీ నిర్ణయాన్ని బట్టీ రెండాకుల చిహ్నం ఎవరికో తేలిపోతుంది. జయలలిత మేనకోడలు దీప స్వతంత్య్ర అభ్యర్థిగా పోటికి దిగడం ఖాయమైంది. పోటీ చేయాలా వద్దా అనే అంశంపై బుధవారం నిర్ణయం తీసుకోనున్నట్లు తమిళ మానిల కాంగ్రెస్‌ అ«ధ్యక్షులు జీకే వాసన్‌ తెలిపారు. తాము పోటీచేయడం లేదు, ఎవ్వరికీ మద్దతు ఇవ్వడం లేదని పీఎంకే అధినేత డాక్టర్‌ రాందాస్‌ మంగళవారం స్పష్టం చేశారు. ఆర్కేనగర్‌లో బహుముఖ పోటీ అనివార్యమైనా నామినేషన్లు ముగిసేవరకు ఖచ్చితంగా ఎన్నిపార్టీలు రంగంలో ఉండేది తేలదు.

గౌతమి రంగప్రవేశం:

కమల్‌తో సహజీవనానికి దూరంగా రాజకీయాలకు దగ్గరగా తన జీవితాన్ని మార్చుకున్న నటి గౌతమి ప్రత్యక్ష రాజకీయాల్లో కాలుమోపనున్నట్లు ప్రచారం జరుగుతోంది. కమల్‌తో విభేదించి వేరు కాపురం పెట్టిన నాటి నుంచి గౌతమి రాజకీయ విమర్శలు చేయడం ప్రారంభించారు. అన్నికంటే ముఖ్యంగా జయలలిత మరణం అనుమానాస్పదమని పదే పదే విమర్శలు చేశారు. ప్రధాని నరేంద్రమోదీను సైతం కలిసారు. సీబీఐ లేదా న్యాయవిచారణ చేపట్టాలని డిమాండ్‌ చేస్తున్నారు. కమలనాథుల తెరవెనుక ప్రోత్సాహం ఉందనేలా గౌతమి రాజకీయాలు సాగుతున్నాయి.

ఈ తరుణంలో అర్కేనగర్‌ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా గౌతమి పేరు పరిశీలనలో ఉన్నట్లు కమలనాథుల సమాచారం. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో బీజేపీ జయభేరి మోగించడం దేశం యావత్తును ఆకర్షించింది. ఆయా రాష్ట్రాల్లోని బీజేపీ ప్రభంజన ప్రభావం ఎంతోకొంత తమిళనాడుపై కూడా పడి ఉంటుందని విశ్వసిస్తున్నారు. దీనికి తోడు సినీరంగం నుంచి వచ్చిన జయలలిత ప్రాతినిథ్యం వహించిన స్థానంలో నటి గౌతమిని నిలబెడితే గెలుపు అవకాశాలు మెరుగుపడతాయని కమలనాథులు అంచనావేస్తున్నారు. అయితే గౌతమి అభ్యర్థిత్వంపై అధికారికంగా ఎవ్వరూ నోరుమెదపడం లేదు.

ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ తనిఖీలు ప్రారంభం:రాజకీయ పార్టీల హాడివుడి అలా ఉండగా మంగళవారం నుంచి అధికారుల హడావుడి మొదలైంది. ఆర్కేనగర్‌లో ఎన్నికల పోలింగ్‌కు మరో నాలుగువారాలు మాత్రమే గడువుండగా ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ అధికారులు రంగంలోకి దిగారు. నగదు బట్వాడా, శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా వాహనాల తనిఖీలు ప్రారంభించారు. ఆర్కేనగర్‌లోకి ప్రవేశించి అన్ని మార్గాల్లోనూ కాపువేసి కార్లు, ద్విచక్ర వాహనాలను తనిఖీలు చేపట్టారు. కేంద్ర పారా మిలిటరీ దళాలు వచ్చేవారం చెన్నైకి చేరుకోనున్నాయి.