2 నిమిషాల 2.0 రచ్చ రచ్చేగా

0సూపర్ స్టార్ రజనీకాంత్ దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో రూపొందుతున్న 2.0 కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు సినిమా ప్రేమికులు. ఇండియా మోస్ట్ కాస్ట్లీ మూవీగా ఇప్పటికే నాలుగు వందల కోట్ల బడ్జెట్ దాటేసిన ఈ మూవీ రిలీజ్ డేట్ ని ఎట్టకేలకు నవంబర్ 29 ఫిక్స్ చేసి ఆ మేరకు పోస్టర్లు కూడా వదిలారు. కనీసం ఆడియో రిలీజ్ అయ్యేదాకా దేన్నీ నమ్మే పరిస్థితిలో లేరు అభిమానులు. ఇప్పటి దాకా జరిగిన ఆలస్యం అలాంటిది మరి. తాజాగా బిబిసి ఛానల్ రూపొందించిన ఓ కార్యక్రమంలో భాగంగా తీసిన 2.0 మేకింగ్ వీడియో ఇప్పుడు ఆన్ లైన్ లో తెగ చక్కర్లు కొడుతోంది. ఇందులో హీరోయిన్ అమీ జాక్సన్ హై లైట్ అవుతుండగా సెట్ లో సందడిగా అల్లరి చేస్తూ హుషారు పుట్టిస్తున్న రజనీకాంత్ ను చూసి ఫాన్స్ తెగ మురిసిపోతున్నారు. ఇప్పటి దాకా ఫస్ట్ లుక్ తప్ప 2.0 కు సంబంధించి ఎలాంటి అప్ డేట్స్ లేవు. త్వరలో టీజర్ అంటున్నారు కానీ ఖచ్చితమైన డేట్ చెప్పడం లేదు.

ఇప్పుడు ఈ మేకింగ్ వీడియో కొంత ఊరట కలిగిస్తోంది. ఫుల్ వెర్షన్ అందుబాటులో లేకపోయినా ఈ మాత్రమైనా చూసే భాగ్యం దక్కింది కదా తలైవా ఫాన్స్ సంబరపడుతున్నారు. విడుదలకు ఇంకా మూడు నెలలు మాత్రమే ఉన్న నేపథ్యంలో దర్శకుడు శంకర్ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు వేగవంతం చేసాడు. ఇంకో రెండు మూడు వారాల్లో గ్రాఫిక్ వర్క్ టేకప్ చేసిన కంపెనీ ఫస్ట్ కాపీని ఇస్తారని తెలిసింది. అందులో వర్క్ సంతృప్తికరంగా ఉన్నట్టయితే మిగిలిన వర్క్ పూర్తి చేసి సెన్సార్ కు వెళ్లడమే ఉంటుంది. కానీ ఖచ్చితంగా నవంబర్ 29న విడుదల ఉండి తీరుతుంది అనే మాట మరోసారి వస్తే తప్ప ఈజీగా నమ్మలేని పరిస్థితి. ఈ డేట్ దరిదాపుల్లో తమ సినిమాలు లేకుండా సౌత్ నిర్మాతలు జాగ్రత్త పడుతున్నారు. బాహుబలి రేంజ్ విజయం దీనికి మాత్రమే సాధ్యమని ఇప్పటికే టాక్ బలంగా ఉంది. అక్టోబర్ లో హైదరాబాద్ లో సైతం ఒక గ్రాండ్ ఈవెంట్ ప్లానింగ్ లో ఉంది యూనిట్. మొత్తానికి వంద రోజుల కౌంట్ డౌన్ ఇప్పటికీ మొదలుపెట్టుకున్న రజని ఫ్యాన్స్ ఈసారి ఏ మాత్రం వాయిదా అన్నా తట్టుకునే స్థితిలో లేరు.