పీకే సర్వే: ఓడిపోతానని భావిస్తే పోటీ చేయను

0Jagan-and-MLA-Rojaతాను ఓడిపోయే పరిస్థితి ఉంటే, లేదా ఓడిపోతానని భావిస్తే తాను వచ్చే ఎన్నికల్లో పోటీ కూడా చేయబోనని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నగరి ఎమ్మెల్యే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఆమె ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడారు. తాను ఓడిపోతానని పార్టీ కనుక భావిస్తే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ కూడా చేయనని చెప్పారు.

తనకు ఎమ్మెల్యేగానే ఉండాలనే ఆశ ఏమీ లేదని చెప్పారు. వైసిపి అధికారంలోకి రావాలని, జగన్ ముఖ్యమంత్రి కావాలన్నదే తన ఆశ అని రోజా చెప్పారు.

తమ పార్టీ అధినేత జగన్‌ను ముఖ్యమంత్రిని చేసే క్రమంలో అవసరమైతే తాను పోటీ నుంచి కూడా తప్పుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నానని చెప్పారు.

కాగా, వైసిపి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సొంత పార్టీ ఎమ్మెల్యేల తీరుపై సర్వే చేయిస్తున్నట్లుగా తెలుస్తోంది. పలు నియోజకవర్గాల్లో సర్వేలు చేసి.. కొందరు అభ్యర్థులను మార్చాలని జగన్‌కు చెప్పినట్లుగా ప్రచారం సాగిన విషయం తెలిసిందే.

ప్రశాంత్ కిషోర్ సర్వేలో రోజాకు కూడా నగరిలో మైనస్ మార్కులు వచ్చాయని చెబుతున్నారు. ఆమెను కూడా మార్చాలని కిషోర్ చెప్పారని అన్నారు. ఈ లిస్టులో రోజా పేరు ఉందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆమె పైవిధంగా స్పందించారు.