అఖిల ఏ డ్రెస్ వేసుకుంటే నాకేంటి, అందుకే చెప్పా..

0Roja-akhila-priyaదుస్తులు, చీరలు కట్టే విషయంలో మంత్రి అఖిలప్రియ, వైసిపి నగరి ఎమ్మెల్యే రోజా మధ్య మాటల యుద్ధం సాగుతోంది. సోమవారం రోజా.. అఖిల చీర అంశంపై మరోసారి స్పందించారు.

అఖిలప్రియ ఏ డ్రెస్ వేసుకున్నా తనకు అభ్యంతరం లేదని రోజా తేల్చి చెప్పారు. కానీ ప్రజల్లోకి వెళ్లేటప్పుడు హుందాగా వెళ్లాలని మాత్రం తాను సూచించానని వివరణ ఇచ్చారు. ఆమె ఎలా వెళ్లినా తనకు అభ్యంతరం లేదని రోజా అభిప్రాయపడ్డారు.

ఇటీవల అఖిలప్రియ దుస్తులపై రోజా మాట్లాడారు. దానికి అఖిలప్రియ గట్టిగా కౌంటర్ ఇచ్చారు. తనపై రోజా వ్యక్తిగత వ్యాఖ్యలు చేస్తే అది ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నానని అఖిలప్రియ చెప్పారు. రోజా తన వస్త్రధారణపై మాట్లాడటం హాస్యాస్పదం అన్నారు.

మహిళలను అవమానించేలా మాట్లాడిన చక్రపాణి రెడ్డి గురించి రోజా మాట్లాడక పోవడం విడ్డూరమని అఖిలప్రియ, ఇతర టిడిపి నేతలు ప్రశ్నిస్తున్నారు. నంద్యాల బహిరంగ సభలో, జగన్ సాక్షిగా చక్రపాణి రెడ్డి దారుణంగా మాట్లాడారని చెబుతున్నారు. వ్యక్తిగతంగా విమర్శలు చేస్తున్న రోజా.. చక్రపాణి రెడ్డి మహిళలను అవమానిస్తే ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.

అఖిలప్రియ దుస్తులపై రోజా చేసిన వ్యాఖ్యలకు టిడిపి నేతలు రోజాకు గట్టి కౌంటరే ఇస్తున్నారు. జబర్దస్త్ లాంటి కార్యక్రమాలకు జడ్జిగా ఉంటూ మహిళలు సిగ్గుపడేలా రోజా వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు అని టిడిపి ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మండిపడ్డారు.

రోజా తీరును మహిళలే చీదరించుకుంటున్నారని మంత్రి నక్కా ఆనంద్ బాబు సోమవారం మండిపడ్డారు. పార్టీలు మారడానికి శిల్పా సోదరులు బ్రాండ్ అంబాసిడర్లు అని ధ్వజమెత్తారు.

నంద్యాలలో టిడిపిదే గెలుపు అని రాజ్యసభ సభ్యులు టిజి వెంకటేష్ అన్నారు. టిడిపి గెలిస్తే అభివృద్ధి చెందుతుందన్నారు. రెండేళ్లలో అభివృద్ధి చెందకుంటే వచ్చే ఎన్నికల్లో ఓటు వేయవద్దన్నారు. చంద్రబాబుపై జగన్ వ్యాఖ్యలు ఏమాత్రం సరికాదన్నారు.