ఆల్మోస్ట్ రికవర్.. త్వరలో షూటింగ్!

0

ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘RRR’ ఇప్పుడు ఇండియా లో సెట్స్ మీద ఉన్న అత్యంత క్రేజీ ప్రాజెక్టులలో ఒకటి. అయితే షూటింగ్ జోరుగా సాగుతుందనుకునే సమయంలో హీరోలు రామ్ చరణ్.. జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరూ గాయాల బారిన పడడంతో షూటింగ్ కు అర్థాంతరంగా బ్రేక్ ఇవ్వాల్సి వచ్చింది. ఏప్రిల్ మొదటి వారంలో చరణ్ జిమ్ లో వర్క్ అవుట్స్ చేస్తూ ఉండగా కాలి మడమకు గాయం అయింది. రెండువారాల తర్వాత ఎన్టీఆర్ మణికట్టుకు గాయం కావడంతో షూటింగ్ కు దూరమయ్యాడు.

ఈ సంఘటనలు అటు చరణ్ అభిమానులలోనూ ఇటు తారక్ అభిమానుల్లోనూ అందోళనను రేకెత్తించాయి. అయితే తాజా సమాచారం ఏంటంటే ఇద్దరు స్టార్లు తమ గాయాల నుండి దాదాపుగా కోలుకున్నారని.. త్వరలో ‘RRR’ షూటింగ్ లో పాల్గొనేందుకు రెడీ అవుతున్నారట. దీంతో వచ్చే ఏడాది జులై 30 న సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేసుకున్న టీమ్ కు రిలీజ్ డేట్ విషయంలో ఎలాంటి మార్పుచేర్పులు చేయాల్సిన అవసరం ఉండదనే అభిప్రాయం వినిపిస్తోంది.

భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ హిస్టారికల్ ఫిక్షన్ లో ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలోనూ.. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలోనూ నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్లు అజయ్ దేవగణ్ ఒక కీలక పాత్రలో నటిస్తుండగా.. అలియా భట్ చరణ్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. మలయాళీ బ్యూటీ నిత్యా మీనన్ మరో కీలక పాత్రలో నటిస్తోంది. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు.
Please Read Disclaimer