హీరోయిన్‌కు అరెస్ట్ వారెంట్

0Mamta-Kulkarni-Pic2 వేల కోట్ల రూపాయల విలువైన డ్రగ్ రాకెట్ కేసులో బాలీవుడ్ నటి మమతా కులకర్ణి పీకల్లోతు కష్టాల్లో పడింది. థానెలోని ప్రత్యేక కోర్టు మమతా కులకర్ణితో పాటు అంతర్జాతీయ డ్రగ్ స్మగ్లర్ వికీ గోస్వామికి నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.

ఈ కేసు వెలుగు చూసిన తర్వాత మమత, గోస్వామి అజ్ఞాతంలోకి వెళ్లారు. వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారని సమాచారం. డ్రగ్ రాకెట్ కేసులో మమత, గోస్వామికి సంబంధమున్నట్టు బలమైన ఆధారాలున్నాయని పబ్లిక్ ప్రాసిక్యూటర్ శిశిర్ హీరే కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఈ కేసులో ప్రధాన నిందితులు వీరేనని, వీరిపై వారెంట్ జారీ చేయాలని కోరారు. ఈ కేసులో పట్టుబడిన నిందితులు పోలీసుల విచారణలో ఈ విషయాన్ని వెల్లడించారని తెలిపారు. భారత్, కెన్యాలో డ్రగ్ రాకెట్ నడుపుతున్నారని, కెన్యాలోని ఓ హోటల్‌లో మమత, గోస్వామి, ఇతర నిందితులు సమావేశమైనట్టు విచారణలో తేలిందని చెప్పారు. వాదనలు విన్న అనంతరం కోర్టు.. మమత, గోస్వామికి వారెంట్ జారీ చేసింది.

2014 ఏప్రిల్‌లో థానె క్రైమ్ బ్రాంచ్ అధికారులు దాడులు చేసి పెద్ద ఎత్తున మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో గోస్వామికి, కెన్యాకు చెందిన అంతర్జాతీయ డ్రగ్ మాఫియాకు ప్రమేయమున్నట్టు కనుగొన్నారు. ఆ తర్వాత విచారణలో చాలామంది పేర్లు వెలుగు చూశాయి. మమత కెన్యాలో ఉన్నట్టు గతంలో వార్తలు వచ్చాయి.