ప్రభాస్ పై అన్ లిమిటెడ్ రూమర్స్

0డార్లింగ్ ప్రభాస్ పై రూమర్లు కొత్తేం కాదు. బాహుబలి సిరీస్ తర్వాత అతడి లెవల్ జాతీయ – అంతర్జాతీయ స్థాయిని టచ్ చేసింది. అందుకే ఇప్పుడు అన్ని మీడియాల్లో ప్రభాస్ గురించిన ఆసక్తికర కథనాలు వెలువడుతున్నాయి. ఇవన్నీ డార్లింగ్ పై ఒత్తిడి పెంచుతూ అంచనాల్ని తారాస్థాయికి తీసుకెళుతున్నాయి. ప్రస్తుతం అతడు నటిస్తున్న భారీ యాక్షన్ అడ్వెంచర్ `సాహో`పైనా – అలానే తదుపరి నటించనున్న బాలీవుడ్ సినిమాపైనా జనాల ఆసక్తిని రెట్టింపు చేస్తున్నాయి.

గత కొంతకాలంగా ప్రభాస్ బాలీవుడ్ ఎంట్రీపై ఆసక్తికర చర్చ సాగుతోంది. మరోసారి రూమర్లు అంతకంతకు పెరుగుతున్నాయి. దర్శకనిర్మాత కరణ్ జోహార్ ప్లానింగ్ లో 2019 ద్వితీయార్థంలో ప్రభాస్ సినిమా సెట్స్పైకి వెళుతుందని ప్రముఖ ఆంగ్ల మీడియాలో కథనాలొచ్చాయి. ఇకపోతే ఈ చిత్రంలో పొడుగుకాళ్ల సుందరి – పద్మావతి ఫేం దీపిక పదుకొన్ ప్రభాస్ నాయిక అంటూ మరో ప్రచారం ఊపందుకుంది. ప్రభాస్ సాహో 2019 సెకండాఫ్ లో రిలీజవుతోంది కాబట్టి ఈ సినిమా తర్వాత బాలీవుడ్ సినిమా ఖాయమైనట్టేనని చెబుతున్నారు. అంతేకాదు వేరొక ప్రముఖ హిందీ వెబ్ పత్రిక సమాచారం ప్రకారం.. సాహో రిలీజ్ బాహుబలి 2 రిలీజ్ తేదీకే ఉంటుందని ప్రచారం సాగుతోంది. సాహో హిందీ రిలీజ్ హక్కుల్ని టీసిరీష్ భూషణ్ ఛేజిక్కించుకున్న సంగతి తెలిసిందే. ఆ క్రమంలోనే కరణ్ జోహార్ తో ప్రభాస్ కి చెడిందన్న పుకార్లు అప్పట్లో షికారు చేశాయి. అయితే మరోసారి కరణ్- ప్రభాస్ కాంబినేషన్ లోనే బాలీవుడ్ సినిమా ఉంటుందన్న కొత్త ప్రచారంలో నిజం ఎంతో తెలియాల్సి ఉంది. ఇకపోతే ప్రభాస్- రణవీర్ సింగ్ కాంబినేషన్ లో భారీ మల్టీస్టారర్ ని కరణ్ నిర్మించనున్నారన్న వార్తల్లోనూ నిజం ఎంతో చూడాలి.