గిన్నిస్‌బుక్‌లోకి ‘పొడుగు కాళ్ల’ సుందరి

0Ekaterina-Lisinaప్రపంచంలోనే అత్యంత పొడుగు కాళ్లు కలిగిన మహిళగా రష్యన్‌ మోడల్‌ ఎకటెరినా లిసినా గిన్నిస్‌ బుక్‌లోకి ఎక్కింది. ఆమె పొడవు 6.87 అడుగులు కాగా.. కాళ్ల పొడవు 52 అంగుళాలు. జూన్‌ 13న ఆమె కాళ్ల కొలతలు తీసుకున్న గిన్నిస్‌ బుక్‌ ప్రతినిధులు అత్యంత పొడుగు కాళ్ల మహిళగా గుర్తించి ధ్రువపత్రం అందజేశారు. ఆమె వివరాలను తాజాగా 2018 ఏడాది ఎడిషన్‌లో పొందుపరిచారు.

29 ఏళ్ల ఎకటెరినా రష్యాలో మోడలే గాక ప్రముఖ బాస్కెట్‌ బాల్‌ క్రీడాకారిణి కూడా. 2008 ఒలింపిక్స్‌లో బాస్కెట్‌బాల్‌ క్రీడలో కాంస్య పతకం గెలిచిన రష్యా జట్టులో ఆమె సభ్యురాలు. రష్యన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో పలు జట్లకు ప్రాతినిధ్యం వహించింది.

తన కూతురు గిన్నిస్‌బుక్‌లో చోటు సంపాదించడం పట్ల ఎకటెరినా తండ్రి విక్టర్‌ లిసిన్‌ మాట్లాడుతూ.. ‘నా కూతురు పుట్టినప్పుడే కాళ్లు చాలా పొడుగున్నాయి. ఆమె శరీరంతో పాటు అవి పెరుగుతూ వచ్చాయి. నేడు ఈ కాళ్లే నా కూతురికి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చాయి’ అన్నారు. ‘నా కాళ్లే మోడల్‌ ప్రపంచంలో నాకు అవకాశాలు, గుర్తింపు తీసుకొచ్చాయి. చాలా మంది మోడళ్లు పొట్టిగా ఉండటంతో ఈ రంగంలో రాణించలేకపోతున్నారు. నాకు ఆ సమస్య లేదు’ అని ఎకటెరినా ఆనందం వ్యక్తం చేసింది.