ఆర్ ఎక్స్ 100.. బాహుబలి రికార్డు బద్దలు కొట్టిందా?

0గత గురువారం రిలీజైన ‘ఆర్ ఎక్స్ 100’ సంచలన వసూళ్లతో దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో అతి పెద్ద థియేటర్లలో ఒకటైన ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని దేవి 70 ఎంఎంలో ఈ చిత్రం వీకెండ్లో హౌస్ ఫుల్స్ తో నడిచింది. చాలా షోట్లు 70-80 శాతం మధ్య ఆక్యుపెన్సీ తెచ్చుకున్నాయి. ఐతే ఈ క్రమంలో ‘ఆర్ ఎక్స్ 100’ బాహుబలి వసూళ్లను దాటేసిందంటూ చిత్ర బృందం ప్రచారం చేసుకుంటుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. తొలి వారం దేవి 70 ఎంఎం థియేటర్లో ‘ఆర్ ఎక్స్ 100’ 2932867 రూపాయలు కలెక్ట్ చేసినట్లుగా పోస్టర్ మీద వేశారు. ‘బాహుబలి’ 2882370 రూపాయల గ్రాస్ తో రెండో స్థానంలో ఉండగా.. తొలి ప్రేమ 2867362 రూపాయల గ్రాస్ తో మూడో స్థానంలో ఉందట.

ఐతే ఇక్కడ పేర్కొన్నది ‘బాహుబలి: ది బిగినింగ్’ కలెక్షన్లని తెలుస్తోంది. అప్పటికి టికెట్ రేట్లు కొంచెం తక్కువ ఉన్నాయి. కాబట్టే ‘ఆర్ ఎక్స్ 100’ కంటే ‘బాహుబలి’ వెనుకబడి ఉందని భావిస్తున్నారు. ఐతే ఒక సింగిల్ థియేటర్లో తొలి వారం వసూళ్ల విషయంలో ‘ఆర్ ఎక్స్ 100’ ఐదో స్థానంలో ఉన్నట్లు ట్రేడ్ పండిట్లు చెబుతున్నారు. ‘బాహుబలి: ది కంక్లూజన్’ సుదర్శన్ థియేటర్లో రూ.36 లక్షల గ్రాస్ తో అగ్ర స్థానంలో ఉండగా.. ‘రంగస్థలం’ అదే థియేటర్లో రూ.31 లక్షలు రాబట్టింది. ఎంసీఏ – బాముబలి-2 సినిమాలు వేరే థియేటర్లలో రూ.30 లక్షల గ్రాస్తో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఏదేమైనా కొత్త హీరో హీరోయిన్లతో ఒక కొత్త దర్శకుడు రూపొందించిన చిన్న సినిమా ఈ స్థాయిలో వసూళ్లు రాబట్టడం అనూహ్యమే. తొలి వారంలో ఈ చిత్రం రూ.9 కోట్ల దాకా షేర్ రూ.15 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టింది. పెట్టుబడి మీద నాలుగైదు రెట్లు ఈ చిత్రం వసూళ్లు రాబట్టబోతుండటం విశేషం.