‘ఆర్ ఎక్స్ 100’ డైరెక్టర్ లాజిక్ పట్టాడు

0

ఈ ఏడాది తెలుగులో సెన్సేషనల్ హిట్టయిన ‘ఆర్ ఎక్స్ 100’ సినిమా ఇప్పుడు అనుకోకుండా వార్తాంశంగా మారింది. తెలంగాణలోని జగిత్యాల పట్టణంలో ఇద్దరు పదో తరగతి విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడానికి ‘ఆర్ ఎక్స్ 100’ సినిమా కూడా ఒక కారణమని.. ఈ సినిమా చూసి ప్రభావితం అయిన ఈ విద్యార్థులు అందులో హీరో లాగా ప్రేమ కోసం ఆత్మహత్యకు సిద్ధపడ్డారని ఈ కేసును విచారిస్తున్న పోలీస్ అధికారి చెప్పడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై ఇప్పటికే హీరో కార్తికేయ స్పందించాడు. తాము సినిమా వాళ్లమని.. టెర్రరిస్టులం కాదంటూ అతను ఒకింత ఆగ్రహంగానే స్పందించాడు. ఈ సినిమాలో హీరో అసలు ఆత్మహత్య చేసుకోడని.. హీరోయినే అతడిని చంపించే ప్రయత్నం చేస్తుందని అతనన్నాడు. సినిమాల ద్వారా ఎవరూ చెడు చెప్పాలని చూడరని కార్తికేయ స్పష్టం చేశాడు.

ఇప్పుడు ఈ చిత్ర దర్శకుడు అజయ్ భూపతి కూడా లైన్లోకి వచ్చాడు. ఈ ఆత్మహత్యలకు ‘ఆర్ ఎక్స్ 100’ సినిమాతో ముడిపెట్టడాన్ని తప్పుబట్టాడు. అతను ఈ విషయంలో ఒక లాజిక్ తీసి మాట్లాడాడు. ‘ఆర్ ఎక్స్ 100’ అడల్ట్ రేటెడ్ సినిమా అని.. 18 ఏళ్లు పైబడ్డ వాళ్లే ఈ సినిమా చూడాలని చెప్పాడు. ఆత్మహత్యకు పాల్పడ్డ ఇద్దరు కుర్రాళ్ల వయసు 18 ఏళ్ల లోపే అని.. వాళ్లు ఆ సినిమా చూడకుండా నివారించాల్సిందని అతను అభిప్రాయపడ్డాడు. అంతకుమించి అతనేమీ మాట్లాడలేదు. తన గురువు రామ్ గోపాల్ వర్మ లాగే అజయ్ లాజిక్కులతో మాట్లాడ్డం ఇప్పటికే కొన్నిసార్లు చూశాం. ఇప్పుడు మరోసారి అతను అదే స్టయిల్లో స్పందించాడు. ఈ విషయమై జనాలు ఎలా స్పందిస్తారో.. పోలీసుల బదులేంటో చూడాలి. ఈ సంగతలా వదిలేస్తే ఇద్దరు విద్యార్థుల మృతి విషయంలో సందేహాలేమీ లేవని.. వాళ్లది ఆత్మహత్యే అని తేల్చేసిన పోలీసులు కేసును క్లోజ్ చేసే ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తోంది.
Please Read Disclaimer