‘సాక్ష్యం’ లాస్ట్ మినిట్ కష్టాలు..

0సరైన ప్లానింగ్ లేకుంటే సినిమాల విడుదల ఎంత కష్టమో మరోసారి తెలిసి వచ్చింది. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సాక్ష్యం’. ఈ మూవీ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదల అయ్యింది. కానీ ఉదయం 8 గంటలకు వేయాలనుకున్న స్పెషల్ షోలన్నీ రద్దు చేశారు. దీనికి ప్రధానంగా చివరి వరకూ సినిమాను పూర్తి క్వాలిటీగా పూర్తి చేయడంలో చిత్రం యూనిట్ ఆలస్యం చేయడమే కారణంగా కనిపిస్తోంది.

జూలై 27న సాక్ష్యం సినిమా రిలీజ్ చేస్తున్నామని నిర్మాతలు ఘనంగా ప్రకటించారు. 40 కోట్ల భారీ బడ్జెట్ మూవీ కావడం.. గ్రాఫిక్స్ భారీగా ఉండడంతో అనుకున్న సమయానికి ఈ చిత్రం పూర్తికాలేదనే టాక్ వినిపిస్తోంది. వారం రోజులుగా దర్శకుడు శ్రీవాస్ చెన్నైలో కూర్చొని సౌండ్ క్వాలిటీ – కరెక్షన్లు చేస్తూ కిందా మీదా పడ్డాడట.. ఆఖరికి 26న రాత్రి 9 గంటలకు కంటెంట్ ను ఫైనల్ చేసినట్టు సమాచారం. ఆలస్యం కావడం వల్ల శుక్రవారం ఉదయం పడాల్సిన షోలు రద్దయ్యాయనే ప్రచారం జరుగుతోంది.

హైదరాబాద్ ఐమ్యాక్స్ లో ఉదయం 8.45 గంటలకు పడాల్సిన షోను రద్దు చేశారు. ఏపీ తెలంగాణల్లో కూడా మార్నింగ్ షోలు పడలేదు. ఇలా ఎంతో ప్రతిష్టాత్మంగా భావించిన ఈ మూవీకి ఆదిలోనే హంసపాదు ఎదురైంది. ఉదయం 11 గంటల షో వరకూ అన్ని క్లియర్ చేసి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.. మొత్తం మీద ప్లానింగ్ ఎంత చేసుకున్నా కానీ సాక్ష్యం సినిమాకు చివరి నిమిషాల్లో ఇబ్బందులు తప్పలేదు.