‘సాహో’కు అప్పుడే అంత పెట్టేశారా?

0‘బాహుబలి’తో తెలుగు సినిమాల బడ్జెట్.. మార్కెట్ లెక్కలే మారిపోయాయి. ఈ చిత్ర దర్శకుడు రాజమౌళి తన తర్వాతి సినిమాను రూ.250 కోట్ల బడ్జెట్ లో తీస్తుంటే.. దాని హీరో ప్రభాస్ రాజమౌళినే మించిపోయాడు. అతను కథానాయకుడిగా యువ దర్శకుడు సుజీత్ తీస్తున్న ‘సాహో’ బడ్జెట్ అంతకంతకూ పెరుగుతూ ఏకంగా రూ.300 కోట్లకు చేరుకున్నట్లు సమాచారం. అసలు ఈ సినిమా చేద్దామన్న ఆలోచన వచ్చినపుడు వంద కోట్ల బడ్జెట్ కూడా అనుకోలేదు. కానీ ‘బాహుబలి’తో ప్రభాస్ మార్కెట్ అమాంతరం పెరిగిపోవడంతో దీని బడ్జెట్ కూడా పెంచుకుంటూ పోయారు. ఏమాత్రం రాజీ లేకుండా హాలీవుడ్ స్థాయిలో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దడానికి ప్రణాళికలు వేసుకున్నారు. ఈ త్రిభాషా చిత్రాన్ని భారీ స్థాయిలో తీర్చిదిద్దుతోంది సుజీత్ టీం.

ఇప్పటిదాకా ‘సాహో’ చిత్రీకరణ 30 శాతమే పూర్తయిందటే. కానీ ఇప్పటికే ఖర్చు రూ.120 కోట్లకు చేరుకున్నట్లు సమాచారం. ఇటీవలే దుబాయ్ లో యాక్షన్ ఎపిసోడ్ పూర్తి చేసిన సంగతి తెలిసిందే. కేవలం దీనికి మాత్రమే రూ.100 కోట్ల దాకా ఖర్చు చేసినట్లు సమాచారం. ఈ సన్నివేశాల్లో భారీతనం చూసి తానే షాకయ్యానని ప్రభాసే స్వయంగా చెప్పిన సంగతి తెలిసిందే. దీని తర్వాత కూడా భారీ లొకేషన్లలో రాజీ లేకుండా సినిమాను తీర్చిదిద్దబోతున్నారు. చిత్రీకరణ ముందుకు సాగేకొద్దీ బడ్జెట్ మరింత పెరిగినా ఆశ్చర్యం లేదంటున్నారు. వచ్చే ఏడాది ఆగస్టుకు ‘సాహో’ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ప్రభాస్ హోం బేనర్ అనదగ్గ ‘యువి క్రియేషన్స్’ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. శ్రద్ధా కపూర్.. నీల్ నితిన్ ముఖేష్.. జాకీష్రాఫ్ తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. శంకర్-ఎహసాన్-లాయ్ సంగీతాన్నందిస్తున్నారు.