ఆ లిస్టులో సాయి తేజ్ కూడా చేరాడోచ్!

0

పేరులో ఏముంది? ఈ టాపిక్కే పెద్ద డిబేట్. షేక్స్ పియర్ లాంటి మహా ఘనుడైన ఆంగ్ల ఉద్దండుడు “పేరులో ఏముంది.. రోజాపువ్వును వేరే పేరుతో పిలిస్తే దానిలో ఉండే మాధుర్యం పిసరంతైనా తగ్గుతుందా?” అంటూ ఎప్పట్లోనో గట్టి పంచ్ ఇచ్చాడు. అలా అని పేరులో ఏమీ లేదు అనుకోకండి. గాంధీ ఫ్యామిలీ నుండి గాంధీని తొలగిస్తే ఎలా ఉంటుంది? ఎక్కడిదాకానో ఎందుకు.. జగనన్న యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ అంటూ వైయస్సార్ పేరు స్ఫురించేలా పార్టీ పేరు ఎందుకు పెట్టాడు?

సినిమాల సంగతి మాట్లాడుకుంటే.. ఒక సినిమా టైటిల్ పెట్టే ముందు “ఆ ఏదో ఒకటి పెడితే పోలా” అని ఏ తలకుమాసిన ఫిలిం మేకర్ కూడా అనుకోడు. అలాగే సినిమా సెలెబ్రిటీల పేర్లకు న్యూమరాలజీలు ఆస్ట్రాలజీలు.. ఎన్నో ఉంటాయి. దర్శకుడు ఓంకార్.. నటి తమన్నా.. బాలీవుడ్ లో అజయ్ దేవగణ్(మొదట్లో అయన పేరు Devagan ఉండేది ఇప్పుడు Devgn అయింది) లాంటి వారు స్పెల్లింగులను మార్చుకున్నారు. ఇక మెగా ఫ్యామిలీ విషయానికి వస్తే మెగాస్టార్ చిరంజీవి అసలు పేరు శివ శంకర వర ప్రసాద్ అని దాదాపుగా తెలుగు ప్రేక్షకులకు అందరికీ తెలిసిందే. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అసలు పేరు కళ్యాణ్ బాబు. మరో మెగా హీరో.. చిరంజీవి చిన్నల్లుడి పేరు కళ్యాణ్ అయితే ఇప్పుడు అది కళ్యాణ్ దేవ్ గా మారింది కదా!

తాజాగా ఈ లిస్టులోకి మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కూడా చేరిపోయాడు. అయితే తేజు పేరు చాలా లేట్ గా మారడం ఒక్కటే చెప్పుకోదగ్గ విషయం. ఏదేమైనా ఇది మెగా ఫ్యామిలీ లో ఆల్రెడీ ఉన్న ట్రెడిషనే. తేజు కొత్త సినిమా ‘చిత్రలహరి’ టైటిల్ క్రెడిట్స్ లో ‘ధరమ్’ లేకుండా తన పేరును ‘సాయి తేజ్’ గా ప్రొజెక్ట్ చేసుకుంటున్నాడు. ఇలా ఎందుకు అని మతిలేని ప్రశ్న అడక్కండి.. బ్యాక్ టూ బ్యాక్ అరడజను ఫ్లాపులున్నాయి మెగా బాబుకు! దాని నుంచి బయటకు రావడానికి తమ వంతుగా ‘న్యూమరాలజి’ టచ్ ఇచ్చే ప్రయత్నం అయి ఉంటుందని టాక్ ఉంది.
Please Read Disclaimer