తేజు ఒక్క మాటా మాట్లాడలేదే..

0ఎలాంటి సినిమా తీసినా.. అది ఎలా తయారైనా.. తమ సినిమాల ఆడియో లేదా ప్రి రిలీజ్ ఈవెంట్ జరిగినపుడు తమ సినిమా సూపరంటూ చిత్ర బృందం గొప్పలు పోవడం మామూలే. ఐతే నిన్నటి ‘తేజ్ ఐ లవ్యూ’ ఆడియో వేడుక సందర్భంగా మాత్రం ఇలాంటి మాటలు వినిపించలేదు. ఎప్పుడూ తన సినిమాల గురించి ఆహా ఓహో అని చెప్పుకునే హీరో సాయిధరమ్ తేజ్.. ఈసారి చాలా సంయమనం పాటించాడు. ‘ఇంటిలిజెంట్’ లాంటి చెత్త సినిమా గురించి కూడా పాజిటివ్ గా మాట్లాడితన అతను ‘తేజ్ ఐ లవ్యూ’ ఎలా ఉండబోతోందనే విషయమే ఎత్తలేదు. కేవలం చిరంజీవి గురించి మాట్లాడి.. ఈ చిత్ర బృందంలో ఒక్కొక్కరి గురించి ప్రస్తావించి.. అందరికీ థ్యాంక్స్ చెప్పి ముగించాడు. ఎప్పుడూ మైక్ ముట్టని ఈ చిత్ర దర్శకుడు కరుణాకరన్ ఒక నిమిషం మాట్లాడాడు కానీ.. ఎక్కడా సినిమా ఎలా ఉంటుందన్నది చెప్పలేదు.

తేజు ఇంతకుముందు తన సినిమాల గురించి అదీ ఇదీ చెప్పి.. ఆ తర్వాత అంచనాలకు తగ్గట్లు సినిమాలు లేకపోయేసరికి విమర్శలెదుర్కొన్నాడు. ఐతే ఈసారి సినిమానే మాట్లాడుతుంది.. తానేం మాట్లాడాల్సిన అవసరం లేదని వెనక్కి తగ్గాడా.. లేక సినిమా మీద నమ్మకం లేక మాట్లాడలేదా అన్నది అర్థం కావడం లేదు. అతడి ఉద్దేశమేదైనప్పటికీ ‘తేజ్ ఐ లవ్యూ’ తన కెరీర్ కు చాలా చాలా ముఖ్యం. ఇది తేడా కొడితే అతడి కెరీర్ అయోమయంలో పడిపోతుంది. ఇప్పటికే వరుసగా ఐదు డిజాస్టర్లు తిన్న తేజుకు ఇంకో ఫ్లాప్ పడితే తట్టుకోలేడు. ఈ నేపథ్యంలోనే చిరు ఈ సినిమా విషయంలో జోక్యం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆడియో వేడుకకు ముఖ్య అతిథిగా వచ్చి ప్రమోషన్ కు సహకరించడమే కాదు.. ఆయన చరణ్ సినిమాలకు చూసినట్లే దీనికీ రషెస్ చూసి.. తన అభిప్రాయాలు.. మార్పులు చేర్పులు చెప్పారట. ఆ విషయాన్ని ఆడియో వేడుకలో కూడా చూచాయిగా చెప్పారు చిరు. మరి ఆయన జోక్యంతో అయినా తేజు కెరీర్ కు అత్యావశ్యకమైన విజయం దక్కుతుందో లేదో చూడాలి.