అడ్రస్ లేకుండా పోయిన సినిమా ఆ రోజొస్తుంది

0నాగశౌర్య తొలిసారిగా నటించిన ద్విభాషా చిత్రం ‘కణం’. ఈ చిత్రంలో సాయిపల్లవి అతడికి జోడీగా నటించింది. ఈ లేడీ ఓరియెంటెడ్ సైకలాజికల్ థ్రిల్లర్ ఎప్పుడో ఫిబ్రవరిలోనే రిలీజ్ కావాల్సింది. కానీ అనివార్య కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. మార్చిలో రిలీజ్ చేద్దామనుకుంటే తమిళనాట సమ్మె వచ్చి పడింది. దీంతో తెలుగు వెర్షన్ రిలీజ్ కూడా ఆపేసి కూర్చున్నారు నిర్మాతలు. ఎట్టకేలకు నాలుగు రోజుల కిందటే తమిళనాట సమ్మె విరమణ జరిగింది. దీంతో వరుస బెట్టి కొత్త సినిమాల్ని వదిలేస్తున్నారు. ‘కణం’ సినిమాను తమిళంతో పాటు తెలుగులోనూ ఒకేసారి ఈ నెల 27న రిలీజ్ చేయాలని ఫిక్సయ్యారు. ఈ మేరకు రిలీజ్ డేట్ పోస్టర్లు కూడా వదిలేశారు.

‘కణం’ షూటింగ్ సందర్భంగా సాయిపల్లవితో విభేదాలు తలెత్తడంతో నాగశౌర్య ప్రమోషన్లకు పూర్తిగా దూరంగా ఉండిపోయాడు. దీంతో ఈ చిత్రానికి తెలుగులో ఆశించి బజ్ రాలేదు. ఐతే దీని టీజర్.. ట్రైలర్ చూస్తే ఇందులో బలమైన కంటెంట్ ఉన్నట్లుగా కనిపిస్తోంది. సినిమాలో సాయిపల్లవి పాత్రే ప్రధానంగా ఉంటుందని అర్థమవుతోంది. ఇంతకుముందు ‘నాన్న’ సినిమాను అందించిన అమలాపాల్ మాజీ భర్త ఎ.ఎల్.విజయ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ‘2.0’ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ తమిళంలో ఈ చిత్రాన్ని నిర్మించడం విశేషం. తెలుగలో ఎన్వీ ప్రసాద్ రిలీజ్ చేస్తున్నాడు. నిజానికి ఏప్రిల్ 27న ‘కాలా’ రావాల్సింది. కానీ అది వాయిదా పడిపోయింది. తెలుగులో ‘కణం’కు పోటీగా మంచు విష్ణు సినిమా ‘ఆచారి అమెరికా యాత్ర’ కూడా రాబోతోంది. ఆ చిత్రం కూడా ‘కణం’ లాగే వాయిదాల మీద వాయిదాలు పడి ఎట్టకేలకు విడుదలవుతోంది.