అందరు శివగామి కాలేరు

0ఎంత ట్రెండ్ మారినా ఫాంటసీ సినిమాలకు ఉండే క్రేజ్ వేరు. వాటిని ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే రీతిలో లాజిక్ ని మరిపించేలా చూపించిన రోజు బ్రహ్మరథం పడతారని నాటి ఎన్టీఆర్ దేవాంతకుడు మొదలుకుని ప్రభాస్ బాహుబలి వరకు ఎన్నోసార్లు రుజువయ్యింది. అందరు ఈ జానర్లో బ్లాక్ బస్టర్ హిట్స్ సాదించినవాళ్ళే. కానీ ఇది రెండు వైపులా పదును ఉన్న కత్తి లాంటిది. ఏ మాత్రం తేడా వచ్చినా రివర్స్ లో గుచ్చుకుంటుంది. అమ్మోరు సినిమాతో టాలీవుడ్ లో ట్రెండ్ సృష్టించిన నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి ఆ తర్వాత చిరంజీవితో తీసిన అంజితో ఆ స్థాయి విజయం సాధించలేకపోయారు అంటే దానికి కారణం ఇదే. అందుకే వీటి జోలికి వెళ్లడం చాలా రిస్క్ తో కూడుకున్న పని. ఇప్పుడు ఈ కోవలో సువర్ణ సుందరి అనే సినిమా ఒకటి వస్తోంది. అవును ఫేమ్ పూర్ణ ప్రధాన పాత్రలో నాటి హీరోయిన్ జయప్రద కం బ్యాక్ పాత్రలో నటిస్తున్న ఈ మూవీ షూటింగ్ ఏనాడో పూర్తయిపోయింది. ట్రైలర్ విడుదల చేసి కూడా 8 నెలలు దాటింది.

ఇందులో విశేషం ఏముంది అనుకుంటున్నారా. బాహుబలి గ్రాఫిక్స్ కోసం వర్క్ చేసిన ఏజెన్సీనే సువర్ణ సుందరికి కూడా పని చేసిందట. చాలా క్వాలిటీ గ్రాఫిక్స్ తో అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో ఇది తీశామని నిర్మాతలు చెబుతున్నారు. నిజానికి బాహుబలి తర్వాత ఆ టీమ్ వెనుక చాలా దర్శక నిర్మాతలు వెంటపడుతున్నారు. సువర్ణ సుందరిని ఆ బ్రాండ్ తోనే ప్రమోట్ చేస్తున్నారు కూడా. విడుదలలో విపరీతమైన జాప్యం జరుగుతున్నప్పటికీ ఖచ్చితంగా మెప్పిస్తుంది అనే ధీమాలో ఉన్నారు. అయినా కంటెంట్ లేకపోతే బాహుబలి కూడా ఆడేది కాదు. గ్రాఫిక్స్ కి తోడు బలమైన ఎమోషన్ బాహుబలి స్థాయిని పెంచింది. అందుకే కట్టప్ప శివగామి లాంటి పాత్రలు అందరి మెదళ్లలో ఇంకిపోయాయి. అది సాధ్యపడాలి అంటే కథనం ముఖ్యం. మరి సువర్ణ సుందరిలో అది ఎంత మేరకు ఉందో విడుదల అయ్యాక చూడాలి. ఎంఎస్ ఎన్ సూర్య దర్శకత్వం వహించిన ఈ మూవీలో సాక్షి చౌదరి మరో కీలక పాత్రలో కనిపిస్తోంది. ఎప్పుడు రిలీజ్ చేస్తారో కానీ పదే పదే బాహుబలి గ్రాఫిక్స్ టీమ్ అతను ప్రచారం చేయటం అనుమానం రేపుతోంది.