సల్మాన్ పై కేసు నమోదు!

0

బాలీవుడ్ కండల వీరు సల్మాన్ ఖాన్ ఇప్పటికే రెండు పెద్ద కేసుల్లో నిందితుడు. మద్యం మత్తులో కారు నడిపి ఫుట్ పాత్ పై పడుకున్న వారి మీదకు కారెక్కించిన కేసుతో పాటు కృష్ణ జింకలను వేటాడిన కేసులో సల్మాన్ ప్రధాన నిందితుడు. ఈ కేసుల దర్యాప్తు ముగిసిపోయింది గానీ… ఆ కేసుల విచారణ జరుగుతున్నంత కాలం సల్మాన్ చాలా ఇబ్బంది పడ్డాడు. తాజాగా ఓ మీడియా ప్రతినిధి బృందంపై తనదైన దురుసును చూపిన సల్మాన్ పై ఇప్పుడు మరో కేసు నమోదైపోయింది. ముంబైలోని డీఎన్ నగర్ పోలీస్ స్టేషన్ లో నమోదైన ఈ కేసు ఏంటంటే.. నిన్న సాయంత్రం 4 గంటల సమయంలో సైకిలెక్కి రోడ్డు మీదకు వచ్చిన సల్మాన్ ను అటుగా వెళుతున్న మీడియా ప్రతినిధులు చూశారు. ఎంతైనా సెలబ్రిటీ కదా… సల్మాన్ సైక్లింగ్ ను కవర్ చేసేందుకు ఉత్సాహం చూపారు. సల్మాన్ సైకిల్ తొక్కుతూ ఉంటే… అతడికి భద్రతగా పరుగెత్తుతున్న ఇద్దరు గార్డులను ఆ మీడియా బృందం పర్మిషన్ అడిగిందట.

అందుకు వారు సరేననడంతో మీడియా ప్రతినిదులు సల్మాన్ సైక్లింగ్ ను సెల్ ఫోన్ లో రికార్డు చేయడం మొదలెట్టారట. అది చూసిన సల్మాన్ ఒక్కసారిగా ఫైరైపోయారట. తన గార్డులను మీడియా బృందంపైకి ఉసిగొల్పాడట. ఇంకేముంది… మీడియా ప్రతినిధుల కారు వద్దకు వచ్చిన గార్డులు సల్మాన్ దృశ్యాలను చిత్రీకరిస్తున్న విలేకరిని తోసేశారట. ఆ తర్వాత సల్మాన్ కూడా రంగంలోకి దిగి విలేకరి చేతిలోని సెల్ ఫోన్ ను లాగేసుకున్నాడట. ఈ సందర్భంగా తాము మీడియా ప్రతినిధులమని చెప్పినా సల్మాన్ వెనక్కు తగ్గలేదట. దీంతో మీడియా బృందం పోలీసులకు ఫోన్ చేసేందుకు యత్నించగా… ఆ సెల్ ను సల్మాన్ తిరిగి ఇచ్చేశాడట. సల్మాన్ దురుసు వర్తనతో నొచ్చుకున్న మీడియా బృందం సమీపంలోని డీఎన్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు ఆధారంగా సల్మాన్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనలో సల్మాన్… అచ్చూ బాలయ్యను తలపించారన్న మాట వినిపిస్తోంది.
Please Read Disclaimer