అంత మంచి టాక్ వచ్చినా..

0కొన్నిసార్లు టాక్ అటు ఇటుగా ఉన్నా మంచి వసూళ్లు వస్తాయి. మరికొన్నిసార్లు మంచి టాక్ వచ్చినా వసూళ్లు ఆశించిన స్థాయిలో ఉండవు. ఈ విషయంలో రిలీజ్ టైమింగ్ అన్నది కీలక పాత్ర పోషిస్తుంది. గత వారం విడుదలైన ‘సమ్మోహనం’కు చాలా మంచి టాక్ వచ్చిన సంగతి తెలిసిందే. విమర్శకులందరూ ఈ సినిమాను పొగిడారు. సామాన్య ప్రేక్షకులు సైతం సోషల్ మీడియాలో ఈ చిత్రం గురించి పాజిటివ్ గానే స్పందించారు. కానీ ఈ చిత్రానికి ఆశించిన స్థాయిలో వసూళ్లు రావట్లేదు. స్టార్ కాస్ట్ లేకపోవడం వల్లో ఏమో ఈ చిత్రానికి ఓపెనింగ్స్ ఓ మోస్తరుగానే వచ్చాయి. వీకెండ్ తర్వాత వసూళ్లు బాగా డ్రాప్ అయ్యాయి. సినిమా నామమాత్రంగా నడుస్తోంది. ఇప్పటిదాకా ఈ చిత్రం షేర్ రూ.6 కోట్ల లోపే ఉంది. ఈ చిత్రానికి వచ్చిన టాక్ ప్రకారం ఈపాటికి పది కోట్ల మార్కును దాటేయాలి.

జూన్ నెల అంటేనే సినిమాల పరిస్థితి ఇలాగే ఉంటుంది. వేసవిలో భారీ చిత్రాలు ఫుల్లుగా కడుపు నింపేస్తాయి. అందులోనూ ఈసారి ‘రంగస్థలం’.. ‘భరత్ అనే నేను’.. ‘మహానటి’ లాంటి సినిమాలు కనువిందు చేశాయి. జూన్ నెలలో స్కూళ్లు – కాలేజీల హడావుడి మొదలవడంతో వసూళ్లపై ప్రభావం పడుతుంది. కాబట్టే ‘సమ్మోహనం’కు కూడా ఆశించిన స్థాయిలో వసూళ్లు రాలేదు. ఈ చిత్రం మరీ క్లాస్ గా ఉండటం కూడా మరో ప్రతికూలత. ఐతే అమెరికా వరకు ఈ చిత్రం మంచి వసూళ్లు రాబట్టింది. హాఫ్ మిలియన్ మార్కును అందుకుంది. తక్కువ బడ్జెట్లో తెరకెక్కిన సినిమా కాబట్టి బయ్యర్లకు పెద్ద నష్టాలేమీ లేవు కానీ.. మంచి టాక్ తెచ్చుకున్న ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో లాభాలు రాకపోవడమే విచారించాల్సిన విషయం. ఐతే ఈ చిత్ర శాటిలైట్ హక్కులకు రేటు పలికే అవకాశముంది. రీమేక్ కోసం కూడా ఆఫర్లు రావచ్చేమో.