సంపూకు.. ఏడుగురు భార్యలు, 12మంది పిల్లలు

0kobbari-mattaబర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు కొత్త సినిమా ‘కొబ్బరి మట్ట’ ఎట్టకేలకు మళ్లీ వార్తల్లోకి వచ్చింది. ఈ సినిమా ఏడాదిన్నర కిందట మొదలవగా.. అప్పట్నుంచి షూటింగ్ కొనసా….గుతూనే ఉంది. ఒక లెంగ్తీ డైలాగ్ తో టీజర్ వదిలి కూడా దాదాపు పది నెలలు అవుతుండగా.. ఇప్పటిదాకా సినిమా విడుదల కాలేదు. కొన్ని నెలల పాటు అసలు వార్తల్లోనే లేకుండా పోయిన ఈ సినిమా ఈ మధ్య సంపూ ఫన్నీ డ్యాన్స్ వీడియోతో మళ్లీ జనాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు ప్రమోషన్ జోరు కొంచెం పెంచి.. సినిమాను త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తేవాలని చూస్తున్నారు. మంగళవారం తన పుట్టిన రోజు సందర్భంగా సంపూ మీడియాను కలిసి ఈ సినిమా గురించి ఆసక్తికర విశేషాలు చెప్పాడు.

‘కొబ్బరిమట్ట’లో సంపూ పోషించిన పాపారాయుడి పాత్రకు ఏకంగా ఏడుగురు భార్యలుంటారట. వాళ్లకు పది పన్నెండు మంది పిల్లలుంటారట. ఆ పది పన్నెండు మందికి ఇంకో 30-40 మంది దాకా పిల్లలుంటారట. ఇలా మొత్తంగా ఓ పెద్ద కుటుంబానికి పెద్దలా ఉంటాడట సంపూ. ఆ రకంగా ‘కొబ్బరి మట్ట’ ఒక పెద్ద ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంటున్నాడు సంపూ. తన తొలి సినిమా ‘హృదయ కాలేయం’ తరహాలో ఇందులో ఎక్కువగా స్పూఫులు ఉండవని.. ఇందులో అంతకు మించిన ఎంటర్టైన్మెంట్ ఉంటుందని అంటున్నాడు సంపూ. ఇందులో డైలాగులు అదిరిపోతాయని.. ‘హృదయ కాలేయం’ సినిమాను జనాలు అప్పట్లో ఎంత ఎంజాయ్ చేశారో.. అంతకుమించిన వినోదాన్ని ‘కొబ్బరి మట్ట’తో అందిస్తామని అంటున్నాడు సంపూ. జూన్ తొలి వారంలో సినిమాను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సంపూ తెలిపాడు.